మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామాపై పెరుగుతున్న రాజకీయ చర్చలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం స్పందిస్తూ,ధన్‌ఖడ్ పూర్తిగా వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్లే రాజీనామా చేశారని స్పష్టం చేశారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ధన్ఖడ తన పదవీకాలంలో అంకితభావం, గౌరవంతో తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చారని పేర్కొన్నారు.
“ధన్‌ఖడ్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఆయన పదవీకాలంలో రాజ్యాంగం ప్రకారం మంచి పని చేశారు. ఆయన తన వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగా రాజీనామా చేశారు. దానిని ఎక్కువగా సాగదీసి ఏదైనా కనుగొనడానికి ప్రయత్నించకూడదు” అని అమిత్ షా ప్రతిపక్షాలకు హితవు చెప్పారు.ధన్‌ఖడ్ “గృహ నిర్బంధంలో” ఉన్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నాయకులు చేసిన ఆరోపణలను కూడా ఆయన తిప్పికొట్టారు. ధన్‌ఖడ్ రాజీనామా లేఖలో అన్ని స్పష్టంగా ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు.
“రాజీనామాకు ఆరోగ్య కారణాలే అని పేర్కొన్నారు. తన పదవీకాలంలో మంచి అనుభవం కల్పించినందుకు ప్రధానమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక గృహ నిర్బంధం ఆరోపణల విషయానికొస్తే నిజం, అబద్ధాలు అనేవి కేవలం ప్రతిపక్షాలు చెప్పిన దానిపైన ఆధారపడి నిర్ణయించకూడదు. మనం దీనిపై గొడవ చేయకూడదు” అని తెలిపారు.
సెప్టెంబర్ 9న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలకు కొద్దిసేపటి ముందు అమిత్ షా నుండి ఈ ప్రకటన వెలువడింది. గత నెలలో ధన్‌ఖడ్ రాజీనామా తర్వాత, ఎన్డీయే మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రతిపక్షం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డిని నిలబెట్టింది.అధికారిక వివరణ ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నాయకులు ధన్ఖడ రాజీనామా చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. రాజీనామా తర్వాత ఆయన ఎక్కడా కనిపించక పోవడం, మాట్లాడక పోవడంతో “ధంకర్ కనిపించడం లేదు” అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను వ్యాప్తి చేస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వం ధంఖర్‌ను మాట్లాడనీయకుండా చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని “మధ్యయుగ కాలం”తో పోల్చారు. “అకస్మాత్తుగా, రాజ్యసభలో విరుచుకుపడే వ్యక్తి మౌనంగా ఉన్నాడు. మనం మధ్యయుగ కాలానికి తిరిగి వెళ్తున్నాము. అక్కడ రాజు ఎవరినైనా తన ఇష్టానుసారం తొలగించగలడు” అని గాంధీ పేర్కొన్నారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పేరు ఆమోదించడంపై అమిత్ షా స్పందిస్తూ ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాది ప్రాంతాలకు చెందిన వ్యక్తి చేపట్టడం సహజమని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రపతి తూర్పు భారత్‌కు చెందిన వారు, ప్రధానమంత్రి పశ్చిమ ప్రాంతాలకు చెందిన వ్యక్తి అని అందుకే ఇలా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. తమిళనాడు 2026 ఎన్నికల కోసం బీజేపీ లాభం పొందాలనే ఉద్దేశంతోనే సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేశారా అని ఊహగానాలపై ప్రశ్నించగా, అమిత్ షా వాటిని తోసిపుచ్చారు.
“మేము గతంలోనూ మిత్రపక్షాలతో కలిసి తమిళనాడులో పోటీ చేశాం. సీట్లు గెలుచుకున్నాం. ఎక్కడి నుంచైనా ఎవరి పేరు పెట్టినా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. రాధాకృష్ణన్ సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినవారు. ఆయన రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మా పార్టీ (బీజేపీ)కి తమిళనాడులో రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నారు. ఝార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ఆయన స్వచ్ఛమైన ప్రజా జీవితాన్ని గడిపారు. గొప్ప రాజకీయ నాయకుడుగా పేరుపొందారు” అని అమిత్ షా వివరించారు.
సీపీ రాధా కృష్ణన్ ఎంపికకు ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధమే కారణమా? అని ప్రశ్నించగా, “ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉంది. నాకు కూడా ఉంది. ప్రజలు మమ్మల్ని ఆ కారణంగానే ఎంచుకున్నారా? ఆర్ఎస్ఎస్ అనుబంధం మైనస్ పాయింట్ కాదు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అడ్వాణీకి కూడా ఆర్ఎస్ఎస్ సంబంధం ఉంది. రాధాకృష్ణన్కూ ఉంది” అని అమిత్ షా స్పష్టం చేశారు.
ఇటీవల సోషల్ మీడియాలోకి వచ్చిన రాహుల్ గాంధీ కార్యక్రమాల రీల్స్‌ను ప్రస్తావిస్తూ, వాటిని కేవలం “కార్యక్రమ నిర్వహణ”గా అమిత్ షా తోసిపుచ్చారు, అదే సమయంలో బిజెపి ప్రత్యక్ష ప్రజా సంభాషణపై ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ నిర్వహించిన వివిధ బహిరంగ కార్యక్రమాల వీడియో రీళ్లపై, షా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, పార్టీ “భ్రమలు” సృష్టించడానికి ప్రయత్నిస్తుందని, ఎన్నికల పరాజయాల తర్వాత పెరుగుతున్న “నిరాశ”ను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
“వారు (కాంగ్రెస్) ప్రజలలో ఒక రకమైన భ్రమను సృష్టించాలనుకుంటున్నారు. వారు ఖచ్చితంగా విజయం సాధించలేరు. ఎందుకంటే ప్రజలతో మన ప్రత్యక్ష సంభాషణ వారి కంటే చాలా రెట్లు ఎక్కువ. మేము ప్రజలతో మాట్లాడుతాము. మేము ఇక్కడకు వచ్చి యాదృచ్ఛికంగా కూర్చోలేదు. మూడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, నిరాశ స్థాయి ఎంతగా ఉందో నేను గ్రహించగలను, సాధారణ తీర్పు భావన, అతను (రాహుల్ గాంధీ) దానిని కోల్పోయాడు” అని ధ్వజమెత్తారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం