
రుతుపవనాలతో జూన్ 20న వర్షాలు ప్రారంభమైనప్పటి నుండి హిమాచల్‌ప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 298మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డిఎంఎ) ఆదివారం వెల్లడించింది. ఎస్‌డిఎంఎ నివేదిక ప్రకారం 298 మృతుల్లో 152 వర్షాలకు సంబంధించినవి. ముఖ్యంగా కొండ చరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, ఇళ్లు కూలిపోవడం, ఇతర వాతావరణ ప్ర భావాల వలన సంభవించాయి. 146 మరణాలు రోడ్డు ప్రమాదాల వలన జరిగాయి.
వీటిలో వర్షాలతో రహదారులపై వాహనాలు అదుపుతప్పడం, దెబ్బతిన్న రోడ్లతో ప్రమాదాల మృతులు ఉన్నారు. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని రహదారులు సహా ఇతర మౌలిక సదుపాయాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. రెండు జాతీయ రహదారులు (ఎన్‌హెచ్-03, ఎన్‌హెచ్-305) సహా 400 రహదారులు మూసుకుపోయాయి. 208 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి, అలాగే 51 నీటి పంపిణీ వ్యవస్థలు పనిచేయడం లేదని ఎస్‌డిఎంఎ తెలిపింది.
మండి జిల్లాలో అత్యధికంగా 220 రహదారులు మూసుకుపోయాయి. వీటిలో ఎన్‌హెచ్-03 కూడా ఉంది. కులులో ఎన్‌హెచ్ -305తో పాటు 101 రహదారులు బ్లాక్ అయ్యాయి. బంజార్, బలిచౌకిలోని అనేక ఈ రహదారికి ఇతర రహదారులతో సంబంధాలు తెగిపోయాయి.
కాంగ్రాలో 21, చంబాలో 24, సిమ్లాలో 8,సిర్మౌర్‌లో 9, కిన్నౌర్‌లో రెండు, లాహౌల్-స్ఫితిలో ఒకటి, బిలాస్ పూర్‌లో రెండు రహదారులు మూసుకుపోయినట్లు తెలిపింది. మండిలో 134 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, కులులో 17, చంబాలో 26, కిన్నౌర్‌లో 23, కాంగ్రాలో 6 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మండి (36), లాహౌల్-స్పిటిలో రెండు నీటిపంపిణీ వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ఇతర ప్రాంతాల్లో స్వల్ప అంతరాయాలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రహదారులు, విద్యుత్ పునరుద్ధరణ, అత్యవసర నీటి సరఫరా చర్యలను అధికారులు చేపట్టారు. అయితే భారీ వర్షాలు సహాయ చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. వర్షాలు కొనసాగుతున్నందున లోతట్టు, కొండచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, ఎప్పటికప్పుడు అధికారుల సూచలను పాటించాలని ఎస్‌డిఎంఎ ప్రజలకు సూచించింది.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు