
ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆగస్ట్ 25 నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు తపాలా శాఖ శనివారం ప్రకటించింది. అమెరికా సుంకాలకు సంబంధించిన మార్పులు ఈ నెల చివరి నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. 800 డాలర్ల విలువైన వస్తువులపై సుంకాల మినహాయింపును ఉపసంహరించనున్నట్లు జులై 30న యూఎస్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసింది. అది ఆగస్టు 29 నుంచే అమల్లోకి రానుంది.
ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, 100 డాలర్ల వరకు విలువైన బహుమతి వస్తువులపై సుంకాల మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నాయి. కాగా, ఆగస్టు 15న సీబీపీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ క్వాలిఫైడ్ పార్టీలు గుర్తింపు ప్రక్రియ, అలాగే సుంక వసూలు, చెల్లింపు విధానంపై స్పష్టత ఇవ్వలేదు.
దీంతో అమెరికాకు వెళ్లే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత పోస్టల్ పార్శిల్స్ను తీసుకెళ్లేందుకు నిరాకరించాయి. ఈ నేపథ్యంలోనే తపాలా శాఖ ఆగస్టు 25 నుంచి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ సేవలను తాత్కాలింకగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది.
కాగా, అమెరికా విధించిన టారిఫ్ డ్యూటీ కలెక్షన్ ప్రక్రియపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆగస్ట్ 25 తర్వాత అమెరికాకు పోస్టల్ పార్శిల్స్‌ను తీసుకెళ్లబోమని పలు విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ఆగస్ట్ 25 నుంచి వంద డాలర్లు వరకు విలువైన లేఖలు, పత్రాలు, బహుమతి వస్తువులు మినహా మిగతా అన్ని రకాల వస్తువుల బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.మరోవైపు ఇప్పటికే పార్శిల్‌లను బుక్ చేసుకున్న, పంపలేని కస్టమర్లు రీఫండ్ క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ‘కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి తపాలా శాఖ తీవ్రంగా చింతిస్తోంది, వీలైనంత త్వరగా అమెరికాకు పూర్తి సేవలను తిరిగి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి