విద్యుత్ వాహనాలకు టోల్‌ లేదు

విద్యుత్ వాహనాలకు టోల్‌ లేదు
రాష్ట్రంలోని టోల్‌ప్లాజాల వద్ద ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ మినహాయింపు కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఐకానిక్‌ అటల్‌ సేతు, ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌ సహా కీలక రహదారులపై ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.  ఈ నిర్ణయం ఆగస్టు 22 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ తెలిపారు.
ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు, ఈ-బస్సులను టోల్ టాక్స్ ఫ్రీ విధానం వర్తించనున్నట్లు పేర్కొన్నారు.  కాగా, భారత్‌లో కాలుష్యం కోరలు చాస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ఎంత ప్రమాదకరంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఎన్ని చర్యలు చేపట్టినా మార్పు రావడం లేదు. ముంబైలో కూడా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దీంతో కాలుష్య నియంత్రణకు మహా సర్కార్‌ చర్యలు చేపట్టింది.
కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్‌ వాహనాలకు టోల్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.  ఈ విధానం వల్ల అధికశాతం మంది ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారని, తద్వారా కాలుష్యం నుంచి బయటపడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.