“మౌనం వహించడం, రాజీపడడం అనేవి బెదిరించేవారికి మరింత ధైర్యాన్నిస్తూ, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవడానికి భారతదేశంతో చైనా దృఢంగా నిలబడుతుంది” అంటూ ఇటీవల భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో జు ఫీహాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ఒక విదేశీ దౌత్యవేత్త నుంచి మరో దేశంపై ఇలాంటి వ్యాఖ్య చేయడం అసాధారణమని విదేశీ వ్యవహారాల నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశం మరికొన్నిరోజుల్లో జరగనున్న సమయంలో చైనా రాయబారి నుంచి ఈ ప్రకటన వచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న దేశాల్లో చైనా ముందంజలో ఉంది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత బాగా పెరిగింది. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం పన్ను విధించింది. అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం పన్ను విధించింది. ఆ తర్వాత 2025 మేలో జెనీవాలో జరిగిన సమావేశంలో రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంలో భాగంగా సుంకాలను తగ్గించాయి.
అయినప్పటికీ రెండు దేశాల మధ్య సుంకాల సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. చైనా మరోసారి ఆగస్టు 21న అమెరికాకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. కానీ ఈసారి అది విదేశీ గడ్డపై భారత్‌లో అమెరికాను బెదిరింపులకు పాల్పడే దేశంగా పేర్కొన్న జూ ఫీహంగ్ ఆ దేశం ఇతర దేశాల నుండి ప్రయోజనాలు పొందిందని, ఇప్పుడు ఇతర దేశాల నుంచి అధిక ధరలను డిమాండ్ చేయడానికి సుంకాలను బేరసారాల సాధనంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు.
”భారత్‌పై అమెరికా 50 శాతం వరకు సుంకాలను విధించింది. ఇంకా ఎక్కువ సుంకాలను విధిస్తామని బెదిరించింది. చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిశ్శబ్దం బెదిరింపుదారులను ప్రోత్సహిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఆసియాలో ఆర్థిక వృద్ధికి రెండు దేశాలను(భారత్, చైనా) ‘డబుల్ ఇంజిన్’గా అభివర్ణించిన ఆయన భారత్, చైనా ఐక్యత మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ పెంచింది. ఇది అమెరికాతో సంబంధాలపై ప్రభావం చూపింది. వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రభావితం చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయాలని బైడన్ పరిపాలనా యంత్రాంగం కోరిందని భారత్ వాదించింది. మరోవైపు అమెరికా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ రష్యాకు మద్దతిస్తోందని ఆరోపిస్తోంది.
ఓ వైపు అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలలో అస్థిరత కనిపిస్తుండగా, మరోవైపు భారత్, చైనా మధ్య సంబంధాలు వేగంగా మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ”భారత్, చైనా మధ్య సాన్నిహిత్యం పెరగడానికి అనేక కారణాల్లో అమెరికా ఒకటి. కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. చైనా ఆర్థికంగా సంపన్నమైనది. భారత్‌కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇది సాధారణ ప్రక్రియ” అని చింతామణి మహాపాత్ర చెప్పారు.
ఈ వారం ప్రారంభంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చారు. భారత్, చైనా ఒకదాన్నొకటి ‘ప్రత్యర్థులు’గా కాకుండా “భాగస్వాములు”గా చూడాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొనడం గమనార్హం. ఏది ఏమైనా భారత్- చైనాల మధ్య అపోహాలు తొలిగి, మరింత సన్నిహితంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం అంతర్జాతీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా ఏకపక్ష ధోరణులకు కళ్లెం వేసేందుకు దోహదపడే అవకాశం ఉంది.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం