
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ మంత్రంతో ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ప్రపంచానికి సహాయపడగల స్థితిలో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌లో మాట్లాడిన మోదీ భారత్ త్వరలో ప్రపంచపు 3వ అతిపెద్ద ఆర్థికశక్తిగా మారి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుందని చెప్పారు. సంస్కరణలు తమ ప్రభుత్వానికి నిబద్ధత, నమ్మకంతో కూడిన విషయమన్న ఆయన దీపావళికి ముందు జీఎస్టీ సంస్కరణలు పూర్తి చేసి ధరలను తగ్గిస్తామని స్పష్టం చేశారు.
“పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులకు పెంచాలి. ప్రైవేటు రంగాలు శుద్ధ ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, క్వాంటం టెక్నాలజీలపై దృష్టి పెట్టాలి. త్వరలో ప్రపంచ వృద్ధిలో భారత్ 20 శాతం సహకారం అందిస్తుంది. ఆర్థిక లోటు 4.4శాతానికి తగ్గనుంది. బ్యాంకులు బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. 2014 తర్వాత ఆటోమొబైల్ ఎగుమతులు 50వేల కోట్ల నుంచి1.2 లక్షల కోట్లకు పెరిగాయి” అని తెలిపారు.
“ఇప్పటికే సాధించిన దానితో సంతృప్తి చెందడం నా స్వభావం కాదు. అదే విధానం మన సంస్కరణలకు మార్గనిర్దేశం చేస్తుంది. మనకు సంస్కరణలు ఒత్తిడి, సంక్షోభం వల్ల కలిగేవి కావు. అవి కేవలం నిబద్ధత, నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నప్పుడు దాని పునాది బలంగా ఉంటుంది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి సంపూర్ణ శక్తితో ముందుకు సాగుతోంది. అభివృద్ధికి పునాది ఆత్మనిర్భర భారత్” అని ఆయన స్పష్టం చేశారు.
మేడ్ ఇన్ ఇండియా 6జిపై మనం వేగంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. “సెమీకండక్టర్ తయారీ భారతదేశంలో 50-60 సంవత్సరాల క్రితమే ప్రారంభమై ఉండేది. కానీ అప్పుడు భారత్ ఆ అవకాశాన్ని కోల్పోయింది. తర్వాత చాలా ఏళ్లు అదే కొనసాగింది. ఇప్పుడు మనం ఆ పరిస్థితిని మార్చాం. సెమీకండక్టర్ సంబంధిత కర్మాగారాలు భారత్‌లోకి వస్తున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ మార్కెట్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. అలాగే భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైలు కోచ్‌లు, రైలు లోకోమోటివ్‌లు ఎగుమతి చేయడం ప్రారంభించిందని తెలిపారు. అలాగే భారత్ త్వరలో 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎగుమతి చేయడం అనే మరో మైలురాయిని చేరుకోనుందని ప్రధాని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన ప్రధాన కార్యక్రమం ఆగస్టు 26న జరుగుతుందని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రతిపక్ష పార్టీల అంతరాయలు ఉన్నప్పటికీ ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రభుత్వం సంస్కరణలను కొనసాగించిందిని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దేశాన్ని ఓటు బ్యాంకు రాజకీయాల్లో చిక్కుకుపోయాని ప్రధాని విమర్శించారు. ఎన్నికలకు మించి ఆలోచించే దృక్పథం వారికి లేదని ధ్వజమెత్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, బాగా అభివృద్ధి చెందిన దేశాలకే సాధ్యమవుతుందని ఆ ప్రభుత్వాలు నమ్ముతున్నాయని పేర్కొన్నారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు