ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు

అక్ర‌మంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌కు పాల్ప‌డిన క‌ర్నాట‌క కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ప‌ప్పీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అరెస్టు చేసింది. చిత్ర‌దుర్గ్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌ప్పీని సిక్కింలోని గ్యాంగ్‌ట‌క్‌లో అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో ఆయనను ప్ర‌వేశ‌పెట్టి,  ఈ కేసును ద‌ర్యాప్తు చేస్ఉత‌న్న అధికారులు ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నారు. త్వ‌ర‌లో అత‌న్ని బెంగుళూరు తీసుకురానున్నారు. 

రూ.12 కోట్ల నగదు(విదేశీ కరెన్సీ సహా), రూ. 6కోట్ల విలువైన నగలు, 10కేజీల వెండి, నాలుగు విలువైన వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే వాటిని ఏయే ప్రాంతాల నుంచి స్వాధీనం చేసుకున్నది స్పష్టంగా తెలపలేదు. క్యాసినో లీజు నిమిత్తం తన సహచరులతో కలిసి వీరేంద్ర గాంగ్‌టక్ వెళ్లినట్లు ఈడీ తెలిపింది. ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టామని ఏజెన్సీ వెల్లడించింది. 

బెంగళూరు జోన్‌కు చెందిన ఈడీ బృందం కేసు దర్యాప్తు జరుపుతోందని, కొద్ది రోజులుగా జరుపుతున్న సోదాలను శనివారం ముగించినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని చిత్రదుర్గ, హుబ్బళ్లి, బెంగళూరు, రా జస్థాన్‌లోని జోధ్‌పూర్, సిక్కిం, ముంబై, గోవాల్లో సోదాలు జరిపినట్లు వెల్లడించింది. ఈ సోదాల్లో భారీ ఎత్తున స్థిర, చర ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలను వీరేంద్ర సోదరుడు కెసి నాగరాజు, ఆయన కుమారుడు పృథ్వీల నివాసాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏజెన్సీ వివరించింది.

మరో సోదరుడు కెసి తిప్పేస్వామి దుబాయి నుంచి ఆన్‌లైన్ గేమింగ్ దందాను ఆపరేట్ చేస్తుంటాడని పేర్కొంది.  పప్పీ క్యాసినో గోల్డ్ పేరిట గోవాలో ఐదు, ఇంకా ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్ తదితర క్యాసినో కేంద్రాలపై కూడా దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ప్రధాన నిందితుడు వీరేంద్ర కింగ్ 567, రాజా567, పప్పీస్ 003, రత్న గేమింగ్ తదితర ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నడుపుతున్నారని వెల్లడించింది.

ఆయన సోదరుడు తిప్పేస్వామి దుబాయి నుంచి డైమండ్ సాఫ్ట్‌టెక్, టిఆర్‌ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ పేరిట మూడు వ్యాపార సామ్రాజ్యాలను నడుపుతున్నట్లు ఈడీ వివరించింది.  వీరికి సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది. ఇదిలావుండగా ఈడీ దాడులపై అటు వీరేంద్ర వర్గం, కుటుంబంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే వీరేంద్ర లీగల్ టీమ్ తాజా దాడులపై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.