అనిల్‌ అంబానీని ఫ్రాడ్‌గా ప్రకటించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

అనిల్‌ అంబానీని ఫ్రాడ్‌గా ప్రకటించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి కష్టాలు పెరుగుతున్నాయి. దివాళా తీసిన రియలన్స్‌ కమ్యూనికేషన్‌ అకౌంట్లను ఎస్‌బీఐ బ్యాంక్‌ ఫ్రాడ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సైతం కంపెనీ అకౌంట్స్‌ మోసపూరితమని ప్రకటించింది. ఇందులో మాజీ డైరెక్టర్‌, పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ పేరు సైతం ఈ కేసులో చేర్చింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ రుణ ఖాతాను మోసపూరితంగా ప్రకటించింది.
2016లో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 2016లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు మూలధనం, నిర్వహణ వ్యయాన్ని అవసరాలను తీర్చడానికి రూ.700 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది.  ఆర్‌కామ్, రిలయన్స్ టెలికామ్, అంబానీ అకౌంట్లను ఫ్రాడ్ అకౌంట్లుగా నిర్ధారించింది. మంజూరు చేసిన రుణాలను ఇతర మార్గాలకు మళ్లించడం, నిబంధనలు పాటించలేదని పేర్కొంది. 
ఈ కంపెనీతో సంబంధాలు ఉన్న కొంత మందికి నోటీసులు పంపించినట్లు చెప్పింది. ఈ మేరకు ఆగస్టు 22, 2025 రోజున ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ వెల్లడించింది.  ఆగస్టు 8వ తేదీన తమకు నోటీసులు అందినట్లు తెలిపింది. నోటీసుల ప్రకారం  రూ.724.78 కోట్ల రుణాలకు సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ లోన్ అకౌంట్లు, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజారి ఆశిష్ కాకెర్‌లను ఫ్రాడ్‌గా పేర్కొంది.
2017, జూన్ 30 నాటికే నిరర్థక ఆస్తులుగా నిర్ణయం తీసుకున్నారని, ఈ విషయంపై రుణ గ్రహీతలు, గ్యారెంటీ ఇచ్చిన వారికి సమాచారం అందిస్తూ వచ్చామని, అయినప్పటికీ ఆ విషయాన్ని వారు పట్టించుకోలేదని పేర్కొంది. 
 
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జూన్‌లో ఎస్‌బీఐ సైతం అకౌంట్లను మోసపూరితమని ప్రకటించిన విషయం తెలిసిందే. రుణాల నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ శనివారం రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, అంబానీ నివాసానికి సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది.