సిపిఐ సీనియర్ నేత, మాజీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి (83) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌళిలోని కేర్ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్సపొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించిన ఆయన జీవితాంతం వామపక్ష రాజకీయాలకు, పేద ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డికి భార్య విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి. ఉన్నత, కళాశాల విద్య కర్నూలులో పూర్తిచేసి, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం(ఎల్ఎల్బీ) చదివారు. 1970లో ఎఐఎస్ఎఫ్ కు, 1972లో ఎఐవైఎఫ్ కు జాతీయాధ్యక్షుడయ్యారు.
1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019 వరకు ఆయన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. ఎఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. చండ్ర రాజేశ్వరరావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు.
ఒకప్పుడు విశాలాంధ్ర ఉద్యమానికి ఆలంబనగా నిలిచిన భారత కమ్యూనిస్టు పార్టీ, మలిదశ తెలంగాణ పోరాటంలో తన పంథా మార్చుకోడానికి ప్రధాన కారణం సురవరం సుధాకర్‌రెడ్డి వ్యూహాత్మక నిర్ణయమని ఆ పార్టీ నేతలు చెబుతారు. సురవరం సుధాకర్‌రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడిని కోల్పోయామని తెలిపారు. సిపిఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి డి.రాజా సురవరం మృతిని తీరని లోటని పేర్కొన్నారు.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ మట్టి బిడ్డ సురవరం పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవిత కాలం పనిచేశారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు పేర్కొంటూ సంతాపం తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ నమ్మిన సిద్దాంతం కోసం చివరి వరకు పనిచేసిన వ్యక్తి అని, సమాజం కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేశారని నివాళులు అర్పించారు.

More Stories
మనూ భూములను లాక్కోవాలని చూడటం దుర్మార్గం
ఎస్ఐఆర్ పక్రియ, ఉపాధి చట్టంపై రేవంత్ ఎన్నికలకు వెళ్లగలరా?
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించండి