
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి ‘మద్దతు’ ఇస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. కేరళలోని కొచ్చిలో జరిగిన మనోరమ న్యూస్ కాంక్లేవ్ 2025 ప్రారంభ సమావేశంలో పాల్గొంటూ జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతుగా తీర్పులిచ్చారని విమర్శించారు.
“నక్సలిజానికి సహాయం చేసిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన 2011 డిసెంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు సల్వా జుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. మావోయిస్టులపై పోరాటం చేసేందుకు గిరిజన యువకులను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని తీర్పు ఇచ్చారు. వెంటనే వారిని నిరాయుధులను చేయాలని ఆదేశించారు. అలా తీర్పు ఇచ్చి ఉండకపోతే, 2020 నాటికి నక్సల్ ఉగ్రవాదం ముగిసి ఉండేది” అని ధ్వజమెత్తారు.
కాగా, భారత ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపిక చేయడంతో, కేరళలో ఆ పార్టీ గెలిచే అవకాశాలు బాగా తగ్గిపోయాయని అమిత్షా జోస్యం చెప్పారు. “కేరళ కూడా నక్సల్ బాధిత రాష్ట్రం. కానీ వామపక్ష పార్టీల ఒత్తిడితో కాంగ్రెస్ పార్టీ నక్సలిజానికి మద్దతు ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెడుతోంది. దీన్ని కేరళ ప్రజలు కచ్చితంగా వ్యతిరేకిస్తారు” అని అమిత్షా స్పష్టం చేశారు.
ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను నిలబెట్టింది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన బీజేపీ నేత కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తన దాడిని మరింత పదును పెడుతూ తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు చేసిన లేదా నిర్బంధించిన ఎన్నికైన ప్రతినిధులను పదవుల నుండి తొలగించేలా చూసే బిల్లును ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా ప్రశ్నించారు.
“ప్రధానమంత్రి జైలు నుండి దేశాన్ని పరిపాలించాలని ప్రజలు కోరుకుంటున్నారా? ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం కార్యదర్శి జైలుకు వెళ్లి ప్రధానమంత్రి/సిఎం ఫైళ్లపై సంతకం చేయించాలా?” అని నిలదీశారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ‘ఓట్ల దొంగతనం ఆరోపణలను’ కూడా హోం మంత్రి తోసిపుచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కుట్రలు ఆడుతోందని షా ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ వద్దకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తూ, “రోడ్డుపై చెప్పిన దానికి ఈసీ ఎలా స్పందించగలదు?” అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇకపై ఓటు చోరీ జరగనివ్వమంటూ బిహార్లో ఓటర్ అధికార్ యాత్ర చేయడంపై అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎస్ఐఆర్ ప్రక్రియపై అనవసర వివాదాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ఆ పార్టీ ఇప్పటి వరకు ఎస్ఐఆర్ పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని అమిత్ షా గుర్తు చేశారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ నిర్వహించాలా, లేదా అనే నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
“దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. బీహార్ ఓటర్ జాబితాలో ఉన్న 22 లక్షల మంది మరణించారు. రానున్న ఎన్నికల్లో వారి పేరుతో బోగస్ ఓట్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి వారి పేర్లు తొలగించాలా? వద్దా? అనేది కామన్ సెన్స్ కు సంబంధించిన విషయం” అని అమిత్ షా పేర్కొన్నారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం