ఐదుగురు ఫిరాయింపు ఎమ్యెల్యేలకు స్పీకర్ నోటీసుల

ఐదుగురు ఫిరాయింపు ఎమ్యెల్యేలకు స్పీకర్ నోటీసుల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రె్‌సలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఉపక్రమించారని తెలుస్తున్నది. బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకూ స్పీకర్‌ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా, వారికీ త్వరలోనే జారీ చేయనున్నట్లు సమాచారం. 
 
ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్‌, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిపై స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పు ఇచ్చింది. 
 
ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, శాసనసభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్‌ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.  అయినా, సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్‌ నిర్ణయించినట్లు సమాచారం. 
 
ఇందులో భాగంగానే ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ నిర్ణయం ప్రకటిస్తారా? లేక పెండింగ్‌లో పెడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. 
 
మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే, దానం నాగేందర్‌ మాత్రం గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌ సహా మిగతావారిపై స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.