
బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్లు, ఇతర రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం అధికారులతో బ్రహ్మోత్సవాల్లో భక్తుల వసతి, ఇతర సౌకర్యాలపై ఈవో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని పలు విశ్రాంతి గృహాలు, కాటేజీల మరమ్మతు పనులను రిసెప్షన్ విభాగంతో సమన్వయం చేసుకుని సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యాత్రికుల వసతి సముదాయాల్లో కూడా సెంట్రలైజ్డ్ బుకింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులు వేచి ఉండే సమయం ఎక్కువగా ఉన్నందున వేరొక ప్రాంతంలో కూడా అన్నప్రసాద భవనం ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆహార భద్రతా అధికారులతో తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార నాణ్యతను పరిశీలించాలని చెప్పారు. అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ విభాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఏర్పాటు చేసిన ధరల పట్టికను పరిశీలించాలని ఆదేశించారు.
తిరుమలలోని హోటళ్లలో భక్తులకు సాంప్రదాయ భోజనం అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తకుండా లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలోని అన్ని కౌంటర్లు పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతినెలా నిర్వహించే ఫీడ్ బ్యాక్ సర్వే ద్వారా వచ్చే భక్తుల అభిప్రాయాలను, సలహాలు, సూచనలను తీసుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు