
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్టయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరిచారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ నిధులను, వనరులను ఉపయోగించుకున్నారని అభియోగాలు మోపారు.
ముఖ్యంగా 2023 సెప్టెంబర్‌లో ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రీ కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు, ప్రభుత్వ డబ్బుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన విక్రమసింఘే, తిరుగు ప్రయాణంలో ఇంగ్లాండ్ వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రయాణ ఖర్చుల విషయమై సీఐడీ అధికారులు ఇదివరకే రణిల్ విక్రమసింఘే సిబ్బందిని ప్రశ్నించారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను రణిల్ విక్రమసింఘే ఖండించారు. హవానాలో జీ-77 సదస్సుకు హాజరై తిరిగి వస్తూ లండన్‌కు వెళ్లాలని ఒప్పుకున్నారు. కానీ అందుకు అయిన ఖర్చులను తన భార్య పెట్టుకుందని, ప్రభుత్వ నిధులను తాను వినియోగించలేదని పేర్కొన్నారు. కానీ, సీఐడీ మాత్రం ఆ పర్యటనలో ప్రభుత్వ సొమ్మునే వాడారని, దీంతోపాటు ఆయన అంగరక్షకులకు కూడా చెల్లింపులు చేశారని చెబుతోంది. ఆయనను ఫైనాన్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారించి, కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చింది.
రణిల్ విక్రమసింఘే ఆరుసార్లు శ్రీలంక ప్రధానిగా పని చేశారు. అయితే 2022లో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనితో అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రణిల్ విక్రమసింఘే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా, క్రమంగా అభివృద్ధిలోకి తీసుకువచ్చారు.
దీనితో ఆయనకు ఎంతో మంచి పేరు వచ్చింది. కానీ ఇది రాజకీయంగా ఆయనకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు అనుర కుమార దిసనాయకే చేతిలో రణిల్ ఓడిపోయారు.
More Stories
వరద బాధిత నిధులను ఉగ్రవాదులకు మళ్లించిన పాక్
సిక్కు మహిళపై లైంగిక దాడిని ఖండించిన బ్రిటిష్ ఎంపీ
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన