తనకంటూ ఏమీ మిగుల్చుకోని  ప్రకాశం పంతులు

తనకంటూ ఏమీ మిగుల్చుకోని  ప్రకాశం పంతులు
 
* జన్మదినం నివాళి
 
సార్..ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూంలో పడక్కుర్చీలో నిద్ర పోతున్నారు. టికెట్ లేదు..బయటికి వెళ్లమంటే వెళ్ళట్లేదు.” స్టేషన్ లో వెయిటింగ్ రూములను పర్యవేక్షించే మహిళ స్టేషన్ మాస్టర్ కి ఫిర్యాదు చేసింది, అది రాజమండ్రి స్టేషన్. సమయం తెల్లవారి ఐదు గంటలు. ‘సరే నేను వస్తా పద ‘అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూంకి వెళ్ళాడు. 
అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక్కుర్చీలో కునికి పాట్లు పడుతున్నాడు  ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు  ఆ ముసలాయన ఎవరో కాదు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన చనిపోవడానికి ఏడాది ముందు జరిగింది ఈ సంఘటన. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులుకు నమస్కరించి  “అయ్యా మీరా? నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని. మీ శిష్యుడిని ” అని నమస్కారం చేశాడట

ప్రకాశం గారు కళ్ళు తెరిచి ” ఏరా.. భోంచేశావా ?” అని అడిగాడట.   పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్ కి అర్థం కాలేదు  ‘తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా కాఫీ తాగావా ? అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా? అని అడుగుతారు..మరి పంతులు గారేంటి భోంచేశావా? అని అడుగుతున్నారు. బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలీక ఇలా అడిగారేమో అనుకుని పంతులు గారితో, “అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలు..మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేశావా? అని అడిగినట్టున్నారు “అని అన్నాడు

దాంతో పంతులు గారు, “ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా ? నేను నిన్నేమ్ అడిగాను..భోంచేశావా ? అనడిగా..దానికి నువ్వేం చెప్పాలి..నేను భోంచేశా.. మీరూ చేసారా ? “అని కదా అడగాల్సింది. స్టేషన్ మాస్టర్ కి విషయం అర్థమైంది.  పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావాల్సిన పదార్దాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు పురమాయించారు. ఈలోపు ప్రకాశం పంతులు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు.

“ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు ?” అని ఒక పెద్దమనిషి పంతులు గారిని అడిగారు.  “విజయవాడ వెళ్తా..” అని చెప్పారు. ఆయన.  దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు..ఐదు రూపాయలు వేసుకుని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు.  రైలు బయలుదేరుతుందనగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళమీద పడి, ” పంతులు గారూ.. మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా. భార్య కాన్సర్ తో బాధ పడుతుందయ్యా” అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు.

పంతులు గారు వాడ్ని లేపి ” ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? ఇదిగో ప్రస్తుతానికి ఈ 72 రూపాయలు ఉంచు. అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు.   ఇదంతా చూసిన ఓ పెద్దమనిషి ” అయ్యా పంతులు గారు, మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు. మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ. సరే.. ఎలాగోలా విజయవాడ చేరతారు. మళ్లీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి. ఇంకొందరు పూనుకుని మిమ్మల్ని రైలెక్కించాలి. ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ ఖర్మ ఏంటి పంతులు గారూ” ” అంటూ భోరున ఏడుస్తూ అడిగారు.

పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ‘”ఏరా నాకేమన్నా అయితే చూసుకోవడానికి ఇంతమంది ఉన్నారు. పాపం వీడికెవరు ఉన్నార్రా ?” అని కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట. ఆ రోజుల్లో తమకోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు. ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు పంతులు గారు. 

ప్రకాశం పంతులును ముక్కుసూటితనం ఆదర్శనీయ శక్తిగా నిలబెట్టింది. ఉజ్జ్వల దేశభక్తి, నిరుపమాన త్యాగగుణం, అలుపెరగని కార్యదీక్ష మహోన్నతుడిగా మలచాయి. గాంధీ మహాత్ముడు వంటి వ్యక్తులు ఆయన స్వభావాన్ని ప్రశంసించారు. కనికరం ఎరుగని బ్రిటిష్‌ తుపాకికి గుండెలు చూపిన ధైర్యశాలి ప్రకాశం- ‘ఆంధ్రకేసరి’గా కీర్తి గడించారు. ఆదర్శ నాయకుడై స్ఫూర్తినందించారు.

మొదటి నుంచీ రాజకీయాల పట్ల ఆసక్తి కలిగిన ప్రకాశం 27ఏళ్ల వయసులో మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, తరవాత చైర్మన్‌గా ఎన్నికయ్యారు. స్నేహితుల సహకారంతో 1904లో ఇంగ్లాండ్‌ వెళ్ళి, బారిస్టర్‌ పూర్తి చేసి, మద్రాస్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, న్యాయం వైపు నిలబడే లక్షణాలు పేరు ప్రఖ్యాతులు సంపాదించిపెట్టాయి. బారిష్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా, మద్రాసు లా టైమ్స్‌ పత్రిక సంపాదకులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. పేదల పక్షపాతిగా పేరుతో పాటు డబ్బునూ గడించారు.

వందేమాతరం, స్వదేశీ ఉద్యమ సమయాల్లో ప్రకాశం ధైర్యంగా అనేక సభలకు అధ్యక్షత వహించారు. 1921లో నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఎందరో మహనీయులు తమ వృత్తులను మానేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం కూడా అదే బాటలో నడిచారు. దేశం కోసం వృత్తిని విడిచి, ఆర్జనను ప్రజలకు పంచిపెట్టిన ప్రకాశం స్ఫూర్తి ఈతరం యువతకు ఆదర్శనీయం. 

స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వరాజ్య పత్రికను ప్రారంభించారు. నిర్భయంగా వార్తలను అందిస్తూ బ్రిటిష్‌ పాలకులకు నిద్ర లేకుండా చేసిన ఆ పత్రిక ఆంగ్లం, తెలుగు, తమిళ భాషల్లో వెలువడేది. సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని నాటి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ప్రకాశం ముందుండి నడిపించారు. 

ఆ సమయంలో ప్రభుత్వం కాల్పుల ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటికే ఓ యువకుడు వీరమరణం పొందారు. అతడి భౌతిక దేహాన్ని చూడటానికి వెళ్తున్న ప్రకాశాన్ని సిపాయిలు అడ్డుకున్నారు. ముందుకు వెళితే కాల్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధైర్యముంటే తనను కాల్చమంటూ బ్రిటిష్‌ తుపాకికి గుండెను చూపి నిలబడ్డారు. వెంటనే తుపాకి నేలను చూసింది, జైజై నినాదాలు ఆకాశాన్ని తాకాయి. 

ఆ తరవాత 1929 లాహోర్‌ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ మీద తిరుగుబాటు చేసి, రాష్ట్ర అధ్యక్ష పదవికి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం గాంధీజీ దండి సత్యాగ్రహానికి చలించిపోయి, కేంద్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, అరెస్టయి జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో కుటుంబం ఆర్థికంగా చితికిపోయి, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చినా ఏ మాత్రం చలించలేదు. 1945లో జైలు నుంచి విడుదలై తెలుగు నాట విస్తృతంగా పర్యటించారు.

టంగుటూరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 1946లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా మహాత్ముడి బాటలో అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు. 1947లో స్వాతంత్య్రం రాకముందే అవిశ్వాస తీర్మానం కారణంగా పదవీచ్యుతులయ్యారు. 
 
ఆ తర్వాత, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితులైన ప్రకాశం 84 ఏళ్ల వయసులో సైతం రాష్ట్రమంతా పర్యటిస్తూ వడదెబ్బకు గురై, 18 రోజులు ఉస్మానియా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి పరమపదించారు. చిన్నతనం నుంచి ఆయన బాధలకు, దుఃఖాలకు కలత చెందలేదు. ఎదిరించి నిలబడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం తప్ప తన సుఖం కోసం పాకులాడలేదు.