ఓటర్ల నమోదు కోసం యుఎస్‌ఎఐడి నిధులు అందలేదు

ఓటర్ల నమోదు కోసం యుఎస్‌ఎఐడి నిధులు అందలేదు

“2014 నుండి 2024 వరకు ”భారత్‌లో ఓటర్ల నమోదు కోసం యుఎస్‌ఎఐడి నుండి 21మిలియన్‌ డాలర్లు అందలేదు లేదా అందించలేదు. ఓటర్ల నమోదుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు” అని కేంద్రం రాజ్యసభకు స్పష్టం చేసింది.  భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి యుఎస్‌ఎఐడి నిధుల వినియోగాన్ని సూచించే నివేదికలపై తీసుకున్న చర్యల గురించి సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన సింగ్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

ఫిబ్రవరి 28న, విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ”గత పదేళ్లలో భారత్‌లో యుఎస్‌ఎఐడి సాయం లేదా నిధులకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులకు (భారత ప్రభుత్వంతో ఏడు భాగస్వామ్య ఒప్పందాల కింద అమలు చేయబడుతున్నవి కాకుండా) చేసిన ఖర్చుల వివరాలను అత్యవసరంగా అందించాలని కోరింది” అని సమాధానంలో పేర్కొన్నారు.

ఇటువంటి కార్యక్రమాలు అమలు చేయచబడిన ఎన్‌జిఒలు లేదా అమలు చేసే భాగస్వాముల జాబితాను కూడా ఎంఇఎ కోరిందని తెలిపారు. ”2014 నుండి 2024 వరకు భారతదేశంలో యుఎస్‌ఎఐడి నిధులను అందించినట్లు” జులై 2న అమెరికా రాయబార కార్యాలయం డేటాను పంచుకున్నట్లు ఆయన తెలిపారు. వాటిలో అమలు చేసిన భాగస్వాముల వివరాలు, లక్ష్యాలు మరియు చేపట్టిన కార్యాచరణ ఫలితాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే 2014 నుండి 2024 వరకు భారతదేశంలో ఓటర్ల నమోదు కోసం యుఎస్‌ఎఐడి నిధులను తీసుకోలేదు, అందించలేదు. భారత్‌లో ఓటర్ల సంఖ్యకు సంబంధించిన కార్యకలాపాలను అమలు చేయలేదు అని కూడా రాయబార కార్యాలయం పేర్కొందని మంత్రి లేఖలో వెల్లడించారు. 

జులై 29న యుఎస్‌ఎఐడి కార్యకలాపాలన్నింటినీ ఆగస్ట్‌ 2025 నాటికి ముగించాలని యోచిస్తున్నట్లు యుఎస్‌ రాయబార కార్యాలయం ఎంఇఎకి తెలిపిందని కీర్తివర్దన్‌ సింగ్‌ రాజ్యసభకు వెల్లడించారు. ఆగస్ట్‌11న , న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఆర్థిక వ్యవహారాల విభాగానికి రాసిన లేఖలో భారత ప్రభుత్వంతో సంతకం చేసిన ఏడు భాగస్వామ్య ఒప్పందాలు 2025 ఆగస్ట్‌ 15తో ముగుస్తాయని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. 

అమెరికాలో యుఎస్‌ఎఐడి కార్యకలాపాలపై సమీక్ష కొనసాగుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు, రాజకీయ ప్రక్రియ బలోపేతం కోసం కన్సార్టియం (సిఇపిపిఎస్‌) ప్రాజెక్టులకు యుఎస్‌ఎఐడి నిధుల్లో 486 మిలియన్‌ డాలర్లను రద్దు చేస్తున్నట్లు, వీటిలో భారత్‌లో ఓటర్ల నమోదును పెంచడానికి కేటాయించిన 21 మిలియన్‌ డాలర్లు కూడా ఉన్నట్లు 2025, ఫిబ్రవరి 16న యుఎస్‌ ప్రభుత్వ సామర్థ్య విభాగం ఎక్స్‌లో పేర్కొందని లేఖలో తెలిపారు.

జులై 1 నుండి యుఎస్‌ఎఐడి కార్యకలాపాలు అధికారికంగా నిలిచిపోయాయి. ఆ కార్యక్రమాల్లో సుమారు 83శాతం రద్దు చేశారు. సిబ్బందిలో 94శాతం మందిని తొలగించారు. యుఎస్‌ఎఐడి మిగిలిన కార్యకలాపాలు మరియు విదేశీ సహాయ నిర్వహణలో మిగిలిన 17శాతం బాధ్యతను విదేశాంగశాఖ స్వీకరించిందని తెలిపారు. యుఎస్‌ఎఐడి కార్యకలాపాలను పూర్తిగా ఈ ఏడాది సెప్టెంబర్‌తో పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత మూడేళ్లుగా భారతదేశంలోని అన్ని యుఎస్‌ఎఐడి ప్రాజెక్టులపై ఖర్చుల వివరాలను అమెరికా రాయబార కార్యాలయం నుండి కేంద్ర ప్రభుత్వం స్వీకరించిందా? అని కూడా బ్రిట్టాస్‌ ప్రశ్నించారు.  2022, 2023, 2024 సంవత్సరాలకు మంత్రిత్వ శాఖకు అందుబాటులో ఉంచిన యుఎస్‌ఎఐడి కేటాయింపుల లబ్ధిదారుల వారీగా వివరాలను అనుబంధ- ఎలో ఉంచామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ఏడాది మార్చిలో కూడా యుఎస్‌ఎఐడికి సంబంధించి రాజ్యసభలో బ్రిట్టాస్‌ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.