ఎస్‌సిఒ సదస్సుకు మోదీతో సహా 20 మంది ప్రపంచ నాయకులు

ఎస్‌సిఒ సదస్సుకు మోదీతో సహా 20 మంది ప్రపంచ నాయకులు

ఈ నెల చివరన తియాంజిన్‌ వేదికగా చైనాలో జరగనున్న షాంఘై సహకార సదస్సు (ఎస్సీఓ)కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ లతోసహా 20 మంది ప్రపంచ నేతలు వస్తారని చైనా వెల్లడించింది. అంతేకాదు ఎస్సీఓ చరిత్రలోనే అత్యంత భారీగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ సహాయ మంత్రి ల్యూ బిన్ తెలిపారు. 

ఎస్సీఓ సదస్సు ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబర్ 1న ముగుస్తుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత ప్రధాని చైనా పర్యటన కేవలం ఎస్సీఓ సదస్సుకే కాకుండా, ఇరుదేశాల దౌత్య సంబంధాలకు అత్యంత కీలకమని చైనా ఉన్నతాధికారులు తెలిపారు. జపాన్ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ, ఆగస్టు 29, 30 తేదీల్లో జపాన్ వెళ్లనున్నారు.

అక్కడే ఆయన 15వ భారత్ -జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. తరువాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తియాంజిన్లో జరిగే ఎస్సీఓ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ 2018లో చివరిసారిగా చైనాలో పర్యటించారు. తరువాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2019లో భారత్ పర్యటనకు వచ్చారు.

అయితే 2020లో లద్ధాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగి పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. దీంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.  వీటిని పునరుద్ధరించేందుకు ఇరుదేశాల సైనిక, దౌత్యాధికారుల మధ్య అనేక దఫాల్లో చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రదాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు.

ఎస్సీఓ అనేది 10 సభ్య దేశాల కూటమి. ఇందులో భారత్, రష్యా, చైనా, ఇరాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బెలారస్ ఉన్నాయి. ఏటా ఓ దేశం అధ్యక్ష బాధ్యతలు వహిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది ఎస్సీఓ ప్లస్ సమ్మిట్ను చైనా భారీగా నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 

ఈ సదస్సులో చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షులు పుతిన్‌, టర్కీ అధ్యక్షులు ఎర్డోగాన్‌, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, మలేషియా ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి ఫామ్‌ మిన్‌ చిన్‌ హాజరవుతారని తెలిపారు. భారత ఉపఖండం నుంచి భారత్ ప్రధాని మోదీ, పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌, నేపాల్‌ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలి, మాల్దీవుల అధ్యక్షులు మహమ్మద్‌ ముయిజు కూడా పాల్గొంటారని చెప్పారు.

అలాగే ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఎస్సీఓ సెక్రటరీ జనరల్ నూర్లాన్ యెర్మెక్బాయేవ్ సహా 10 అంతర్జాతీయ సంస్థల అధికారులు పాల్గొంటారు. ఈ విధంగా ఎస్సీఓ చరిత్రలోనే అత్యంత గొప్పగా ఈ సదస్సును నిర్వహిస్తామని ల్యూ బిన్ తెలిపారు.

“ఈ షాంఘై సహకార సంఘం సదస్సులో ఎస్సీఓ సభ్య దేశాలు ఒక సంయుక్త ప్రకటన జారీ చేస్తారు. అందులో రానున్న 10 ఏళ్లకు ఎస్సీఓ అభివృద్ధి వ్యూహాన్ని ఆమోదిస్తారు. అంతేకాదు ఫాసిస్టు వ్యతిరేక యుద్ధంలో విజయం సాధించిన 80వ వార్షికోత్సవం, ఐక్యరాజ్యసమితి 80వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని గుర్తు చేసే ప్రకటనలను చేస్తారు” అని ల్యూబిన్ వెల్లడించారు.

ఈ సదస్సు తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 3న బీజింగ్‌లో చైనా దశాబ్దాలలో అతిపెద్ద సైనిక కవాతు జరుపనుంది. హైపర్‌సోనిక్ క్షిపణులు, మానవరహిత వ్యవస్థలు, అధునాతన విమానాలు వంటి కొత్త తరం ఆయుధాలను ఆవిష్కరించనున్నట్లు బీజింగ్ సూచించింది.