జైలు నుంచి ఎందుకు ప్రభుత్వాన్ని నడపాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. జైలు పాలైన పీఎం, సీఎం, మంత్రులెవరైనా తమ పదువులు కోల్పోయే రీతిలో ఇటీవల పార్లమెంట్‌లో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బీహార్‌లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆ రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశిస్తూ మోదీ వ్యాఖ్యలు చేశారు.
“ప్రభుత్వ ఉద్యోగిని 50 గంటల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నాడు. అతను ఓ డ్రైవర్ అయినా, క్లర్క్ అయినా, ప్యూన్ అయినా జాబ్ పోతోంది. కానీ సిఎం, మంత్రులు జైలులోనే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. గతంలో కొందరు జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేసేవారు. జైలు నుంచే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేవారు” అని ప్రధాని గుర్తు చేశారు.
ఒక ప్రజానేతకు అటువంటి వ్యక్తిత్వం ఉంటే, అప్పుడు మనం అవినీతిని ఎలా ఎదుర్కుంటాము? అని ప్రధాని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్‌డిఎ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిందని చెబుతూ ఆ చట్ట పరిధిలోకి ప్రధానమంత్రి కూడా వస్తారని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ చట్టం ఆమోదం పొందితే, అప్పుడు జైలులో ఉన్న ప్రధాని అయినా, సిఎం అయినా 31వ రోజు తన పదవిని కోల్పోవాల్సిందే అని వెల్లడించారు.
త్వరలో ఎన్నికలు జరుగనున్న బీహార్ లో ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద కట్టిన ఇళ్లకు గహ ప్రవేశం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ గ్రామీణ పథకం కింద 12 వేల మంది లబ్ధిదారులు, అర్బన్ పథకం కింద 4వేల మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన తెలిపారు. బీహార్ చాణక్యుడు, చంద్రగుప్తుడు ఏలిన ప్రదేశం అని ప్రధాని కీర్తించారు. అన్ని సమయాల్లోనూ దేశానికి వెన్నుముకగా బీహార్ నిలిచిందని పేర్కొన్నారు.
ఇక్కడ తీసుకున్న దీక్షలు ఈ దేశాన్ని బలోపేతం చేశాయని, ఎన్నడూ వృద్దా కాలేదని ప్రధాని స్పష్టం చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉగ్రవాదులను అణిచివేస్తామని ఇక్కడ నుంచే పేర్కొన్నట్లు ప్రధాని గుర్తు చేశారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరిందని, దాన్ని ప్రపంచం కూడా ప్రత్యక్షంగా చూసిందని తెలిపారు. ఆర్‌జెడి పాలన సమయంలో గయాజీ లాంటి పట్టణాలు చీకట్లోకి వెళ్లినట్లు మోదీ ఆరోపించారు. ఎన్నో తరాల నుంచి ప్రజలు ఇక్కడ నుంచి వలస వెళ్లినట్లు చెప్పారు. బీహారీ ప్రజలను ఆర్‌జెడి కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని, రాష్ట్ర ప్రజల జీవితాలు, బాధలు, గౌరవమర్యాదల గురించి ప్రతిపక్షాలు ఆలోచించడం లేదని ప్రధాని విమర్శించారు. బీహార్ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్‌డిఎ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ప్రధాని చెప్పారు.
కాగా, బీహార్‌లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్ హెచ్-31లోని అవుంటా-సిమారియా వంతెనను ప్రారంభించారు. ఇందులో గంగా నదిపై 1.86 కి.మీ. పొడవైన ఆరు లేన్ల విస్తరణ కూడా ఉంది.భారతదేశంలోనే అత్యంత విశాలమైన వంతెనగా పరిగణించబడుతున్న ఈ ప్రాజెక్ట్, జాతీయ రహదారి 31పై రూ.1,870 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు.
ఇది పాట్నాలోని మోకామా- బెగుసరాయ్ మధ్య ప్రత్యక్ష కనెక్టివిటీని అందిస్తుంది. వంతెన ప్రారంభోత్సవంతో, శుక్రవారం బీహార్‌లో రూ.13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు.ప్రారంభోత్సవం తర్వాత, ప్రధాని వంతెనపై నిలబడి జనసమూహాన్ని చూసి తన ‘గామ్‌చా’ను ఊపారు. ఈ వంతెన పాత రెండు లేన్ల శిథిలావస్థలో ఉన్న ‘రాజేంద్ర సేతు’కు సమాంతరంగా నిర్మించారు.
More Stories
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
బాక్సింగ్ చాంపియన్షిప్స్లో రెండు బంగారు పతకాలు
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!