భారత్ లో పెట్టుబడులకు రష్యా కంపనీలకు ఆహ్వానం

భారత్ లో పెట్టుబడులకు రష్యా కంపనీలకు ఆహ్వానం
* పుతిన్ ను కలిసిన జైశంకర్
భారత్ -రష్యా సంబంధాలపై మరింత సృజనాత్మకంగా ముందుకెళ్లాలని పేర్కొంటూ  ఇందులో భాగంగా భారత్‌లోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా కంపెనీలను విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆహ్వానించారు. భారత్-అమెరికా మధ్య రష్యా చమురు దిగుమతులపై ఏర్పడిన ఉద్రిక్తతల నడుమ మాస్కోలో జరిగిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ సమావేశంలో జైశంకర్ పాల్గొన్నారు. 

 
రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌ డెనిస్‌ మంటురోవ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడంతోపాటు వివిధ అంశాల్లో సహకరించుకోవాలని ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి సూచించారు.  ‘ఎక్కువ చేయాలి, భిన్నంగా చేయాలి’ అన్నదే ఇరు దేశాల వాణిజ్యమంత్రంగా ఉండాలని చెబుతూ గత నాలుగేళ్లలో భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందని జైశంకర్‌ స్పష్టం చేశారు. 
కానీ ఆ పెరుగుదలతో పాటు భారీ అసమతుల్యత కూడా ఉత్పన్నమైందని తెలిపారు.  “2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల వాణిజ్యం 2024–25లో 68 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే, 2021లో 6.6 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే తొమ్మిది రెట్లు పెరిగింది. దీనిని తక్షణమే పరిష్కరించుకోవాలి” అని జైశంకర్‌ సూచించారు. 
 
భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థికవ్యవస్థ అని ఆయన గుర్తుచేశారు. మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో విదేశీ వాణిజ్యానికి కొత్త ద్వారాలు తెరిచిందని చెబుతూ భారత్‌లో రష్యా కంపెనీల వ్యాపార విస్తరణకు ఇది మరింత దోహదం చేస్తుందని తెలిపారు.
కాగా, జై శంకర్‌ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. భారత్‌, రష్యా సంబంధాలను మరింతగా విస్తరించడానికి గల మార్గాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందే రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌తో కూడా జై శంకర్‌ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించడంపైనే వారు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 
 
రెండో ప్రపంచయుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రధాన సంబంధాల్లో భారత్‌, రష్యా మధ్య సంబంధాలే స్థిరంగా కొనసాగుతున్నాయని జై శంకర్‌ వ్యాఖ్యానించారు. భౌగోళిక, రాజకీయ అంశాలు, నాయకత్వాల మధ్య సంబంధాలు, ప్రజల మనోభావాలు ఇవన్నీ ఇందుకు కీలకమైన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. నవంబరు లేదా డిసెంబరు మాసంలో పుతిన్‌ భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నందున అందుకు ముందుగా అవసరమైన కొన్ని అంశాల పరిష్కారానికి గానూ జై శంకర్‌ మంగళవారం మాస్కో చేరుకున్నారు.