క్రిమినల్ కేసులలో టాప్ రేవంత్, స్టాలిన్, చంద్రబాబు

క్రిమినల్ కేసులలో టాప్ రేవంత్, స్టాలిన్, చంద్రబాబు
 
* అత్యధికంగా నేరారోపణలున్న 10 మంది సీఎంలతో ఒక్కరే బీజేపీ
 
దేశంలోని ముఖ్యమంత్రులలో 42 శాతం మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్‌కు వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది.  వరుసగా 30 రోజులు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పదవులను కోల్పోయేందుకు ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏడీఆర్‌ నివేదికలోని అంశాలు సంచలనంగా మారాయి. 
దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ముఖ్యమంత్రులలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపైనే అత్యధికంగా కేసులు ఉండడం గమనార్హం. దేశంలోని 31 మంది ముఖ్యమంత్రులలో 13 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్‌ వెల్లడించింది.  వీరిలో 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాప్‌, లంచం, వేధింపులు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి.
ఈ 10 మంది ముఖ్యమంత్రులలో ఏడుగురు ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలకు చెందిన వారు కాగా బీజేపీ మిత్రపక్షాలకు చెందిన వారు ఇద్దరు, బీజేపీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈ 10 మంది ముఖ్యమంత్రులపై ఉన్న నేరారోపణలు రుజువైతే గరిష్ఠ స్థాయిలో ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉంది.  ఎన్నికల నేరాలు, ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడం, దాడులు, హత్యాయత్నాలు, కిడ్నాప్‌, అత్యాచారం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న రేవంత్‌ రెడ్డిపై మొత్తం 89 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలకు సంబంధించి 72 కేసులు ఉన్నాయి. అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రుల జాబితాలో రెండవ స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(డీఎంకే) ఉన్నారు. ఆయనపై మొత్తం 42 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరాలకు చెందిన కేసులు 11 ఉన్నాయి. ఈ జాబితాలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు(టీడీపీ) ఉన్నారు. ఆయనపైన మొత్తం 19 కేసులు ఉన్నాయి. తీవ్రమైన నేరాభియోగాలు 32 ఉన్నాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాలుగవ స్థానంలో ఉన్నారు. ఆయనపై మొత్తం 13 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలు 6 ఉన్నాయి. 5వ స్థానంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌(జేఎంఎం) ఉన్నారు. ఆయనపై మొత్తం 5 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలు 7 ఉన్నాయి. ఆరవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌(బీజేపీ) ఉన్నారు. ఆయనపై మొత్తం 4 కేసులు ఉన్నాయి. వీటిలో తీవ్రమైన నేరారోపణలు 2 ఉన్నాయి. 

జాబితాలో 7వ స్థానంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు(కాంగ్రెస్‌)పై మొత్తం 4 కేసులు ఉన్నాయి. 8వ స్థానంలో ఉన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌(సీపీఎం)పై మొత్తం 2 కేసులు ఉండగా ఈ రెండూ తీవ్రమైన నేరారోపణలకు సంబంధించినవే. జాబితాలో 9వ స్థానంలో సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్‌ తమాంగ్‌(ఎస్‌కేఎం) ఉన్నారు. ఆయనపై ఒకే కేసు ఉంది. 10వ స్థానంలో ఉన్న పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌(ఆప్‌)పై ఒకే కేసు ఉంది.