సుంకాల ప్రభావం శూన్యం – శాసించేది భారతే!

సుంకాల ప్రభావం శూన్యం – శాసించేది భారతే!

ఎస్‌. విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు

“భారత ఉత్పత్లులు ప్రపంచ మార్కెట్‌ను శాసించాలి. అధిక నాణ్యత, తక్కువ సరే మన బలం” అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలకు, పారిశ్రామిక రంగానికి, యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఔత్సాహికులకు పిలుపునిచ్చారు.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశ అభివృద్ధిని తగ్గించడానికి, అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదురుగుతున్న భారత్ ను నిర్వీర్యం చేయడానికి టారిఫ్‌ల కుట్రకు తెరతీశారు. 
 
అయితే భారత్ ఏ మాత్రం సడలడం లేదు.  ఎవరి దయాదాక్షిణ్యాలపై భారత వ్యాపార, వాణిజ్యరంగం ఆధారపడి లేదు.   భారత్ నుంచి జాలి పడి అమెరికా సహా ప్రపంచదేశాలు దిగుమతులు చేసుకోవడం లేదు.  వారికి అవసరం అయితేనే మన దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేస్తున్నాయి.   ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు.. భారత్‌ ఎగుమతులపై ఎలాంటి బెంగ అవసరం లేదని ప్రధాని మోదీ చెబుతున్నారు.  బెదిరింపులకు తలొగ్గే రోజులు పోయాయని ఎర్రకోట నుంచి నినదించారు. 
 
ప్రపంచంలో చైనాకు ఓ బ్రాండ్ ఉంది. అదేమిటంటే  డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తుందని. నాసిరకం వస్తువుల్ని ప్రపంంచ మీదకు వదులుతుందని. అదే భారత్ కు ప్రపంచ స్థాయిలో  ఉన్న బ్రాండ్ వేరు. ప్రాణాలు నిలిపే ఫార్మా దగ్గర నుంచి అత్యుత్తమ నాణ్యతతో కూడా సాఫ్ట్ వేర్ ఎగుమతుల వరకూ భారత్ అన్ని రంగాల్లోనూ తక్కువ ధర – అధిక నాణ్యత  బ్రాండుతో  దూసుకెళ్తున్నాయి.  
 
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం భారత మార్కెట్ పై కన్నేసి అమెరికా వస్తువుల్ని భారత్ లో కి డంపింగ్ చేసి భారత ఆర్థిక వ్యవస్థ మీద కన్నేసే సుంకాలు విధించారు.  అమెరికాలో ఆవులకు మాంసాహారం పెడతారు. వాటి నుంచి వచ్చే పాలను మాంసాహార పాలు అంటారు. వాటిని ఇండియాలోకి డంపింగ్ చేద్దామనుకున్నారు. అది కూడా పన్నులు లేకుండా.  కానీ ఇండియా అంగీకరించలేదు.  భారీగా పన్నులు విధించినా సరే అలాంటి వాటికి ఇండియాలో చోటు లేదని తేల్చేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్  ఏదో భారత్  తన మీద ఆధార పడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలిచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా టారిఫ్‌లు వేస్తున్నారు.  అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు. అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అసలు చేసుకోలేదు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాల్ని తీరుస్తుంది. అంతే కానీ భారత్ ను బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు. 
 
భారత్ పై సుంకాలు విధించడం, ఆంక్షలు విధించడం అమెరికాకు మొదటి సారి కాదు.  భారత్ తన భద్రత కోసం అణుపరీక్షలు నిర్వహించినప్పుడు కూడా అమెరికా ఆంక్షలు విధించింది. 1998లో భారత్ పోక్రాన్-II అణు పరీక్షలు చేసిన తర్వాత, అమెరికాలోని క్లింటన్ ప్రభుత్వం  భారత్‌పై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించింది. అమెరికా చట్టం ప్రకారం కొత్త రుణాలు, రక్షణ, డ్యూయల్-యూజ్ టెక్నాలజీల వాణిజ్యం ఆపేశారు.  టారిఫ్‌ల కంటే తీవ్రమైన ఆర్థిక, వాణిజ్య పరిమితులు విధించారు.  
 
2001–2002  జార్జి బుష్ ప్రభుత్వం  స్టీల్ టారిఫ్‌లు 8% నుంచి 30% వరకు విధించింది. అయినా భారత్ ఎక్కడా తల వంచింది లేదు.  అదే సమయంలో ఆ ఆంక్షలు కానీ..టారిఫ్‌లు కానీ భారత్ ను ఆర్థికంగా దెబ్బతీసింది కూడా లేదు. అదే సమయంలో అమెరికా మనపై ఆధారపడింది కూడా.  ఐటి, సాఫ్ట్‌వేర్ బూమ్ కారణంగా  1998–2004 కాలంలో అమెరికా ఐటీ దిగ్గజ కంపెనీలు  యాక్సెంచర్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా కంపెనీలు కూడా భారతీయ టాలెంట్, ఔట్‌సోర్సింగ్‌ను వదల్లేదు. అప్పటితే పోలిస్తే ఇప్పుడు ఇంకా భారత్ పై ఆధారపడటం పెరిగింది.  
భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతులు వస్తువలు, సేవలు  కలిపి 2024లో  ఎగుమతుల మొత్తం విలువ సుమారు $87 బిలియన్లు అంటే  సుమారు రూ. 7.3 లక్షల కోట్లుకు చేరుకుంది. ఇది భారత్ మొత్తం ఎగుమతులలో 18% వాటా. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ 2024 వరకులో గూడ్స్ ఎగుమతులు మాత్రమే$52.95 బిలియన్ ఉండగా, పూర్తి సంవత్సరానికి మొత్తం ఎగుమతులు (గూడ్స్+సర్వీసెస్) $80-90 బిలియన్ మధ్య ఉండవచ్చు.  
 
నెలవారీఎగుమతులు సుమారు $8.3 బిలియన్ ఉండటంతో, మొత్తం సంవత్సరానికి సుమారు $90-100 బిలియన్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సుంకాల వల్ల ఇవన్నీ ఆపేస్తారా అంటే అసలు అవకాశం లేదు. భారత్ అతి తక్కువ ధరలకు, నాణ్యమైన వస్తువుల్ని సరఫరా చేస్తోంది.  ఉదాహరణకు ఫార్మాస్యూటికల్ రంగం.  దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన నాన్-పేటెంటెడ్ ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది.  
 
టారిఫ్‌ల వల్ల ఈ రంగంలో డిమాండ్ తగ్గే అవకాశం లేదు.  ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి కాకపోతే అక్కడ అల్లకల్లోలం ఏర్పడుతుంది.   అందుకే ఎగుమతులపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. అలాగని పూర్తిగా ఇబ్బంది ఉండదా అంటే.. ఖచ్చితంగా ఉంటుంది.  అమెరికా ప్రజలు వస్తువులు కొనలేక వినియోగం తగ్గించుకుంటారు. ఆ ప్రభావం మన మీద పడుతుంది. కానీ  ట్రంప్ టారిఫ్‌ల వల్ల అమెరికా ప్రజలు నష్టపోతారా? భారత ప్రజలా? అన్నది తర్వాత విషయం కానీ దేశ ఆత్మగౌరవం కాపాడుకోవడం ముఖ్యం.
భారతీయుల వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యం. 
 
అదే సమయంలో సంక్షోభాల్లో  అవకాశాలను సృష్టించుకున్నట్లుగా భారత్ కొత్త మార్కెట్లను అన్వేషించుకోవడనికి అవకాశం ఏర్పడుతుంది.  ఇప్పటికే భారత్ ప్రత్యామ్నయంగా మార్కెట్లను వివిధ దేశాల్లో పెంచుకుంటోంది.  నైజీరియా, దక్షిణ ఆఫ్రికా, కెన్యా, గినియా, ఇతర ఆఫ్రికన్ దేశాలకు భారత ఎగుమతులు పెరుగుతున్నాయి.  2024లో ఆఫ్రికాకు ఎగుమతులు $45 బిలియన్‌కు చేరాయి, 5% వృద్ధి నమోదైంది. ఔషధాలు , వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది.  ఆఫ్రికా దేశాలలో ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రతకు డిమాండ్ పెరగడం, భారత్  చవకైన జనరిక్ ఫార్మా రంగానికి మార్కెట్ పెంచుతోంది.
అలాగే లాటిన్ అమెరికా దేశాలైన బ్రెజిల్, మెక్సికో, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలకు  2023-24లో $234 మిలియన్ విలువైన ఎగుమతులు చేశాం.   కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్  వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్. వంటి దేశాలకు ఎలక్ట్రానిక్స్ , మొబైల్ ఫోన్స్, కాంపోనెంట్స్ , రసాయనాలు, లైట్ నాఫ్తా, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు పెరుగుతున్నాయి.  అరబ్ దేశాలతో పాటు యూరప్‌లో కొత్త మార్కెట్లు  భారత్ కు ద్వారాలు తెరుస్తున్నాయి.  
 
బెల్జియం, ఇటలీ, జర్మనీ మన దేశ నుంచి  పలు రకాల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాయి. ఇటలీలో  అమ్ముడయ్యే కాఫీ ఉత్పత్తుల్లో 9% మార్కెట్ షేర్ మన దేశం నుంచి దిగుమతులదే.  ఏ ఒక్కదేశం మీద ఆధారపడకుండా భారత ఎగుమతులు ఉండేలా  ఉండేలా కేంద్రం న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ (2023-28),  పీఎల్ఐ స్కీమ్స్, రోడ్‌టెప్ & రోస్‌సిటిఎల్ స్కీమ్స్, డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్స్ వంటివి ఎగుమతులను ప్రోత్సహిస్తున్నాయి.  
 
యుఏఈ, ఆస్ట్రేలియా, ఈఎఫ్ టిఏ (ఐస్‌లాండ్, లీచెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్)తో ఎఫ్ టి ఏలు, యుకె,  ఒమన్‌తో  చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి రాబోతున్నాయి. దీని వల్ల ఎగుమతుల వైవీధ్యీకరణ జరుగుతుంది. అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ శాఖ మార్కెట్ మరింత విస్తృతమయింది. ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాల పదును ఏంటో ప్రపంచానికి  తెలిసింది. దాంతో  ఎగుమతులు పెరుగుతున్నాయి.
 
ఇవి ఇప్పుడు ‘యుద్ధంలో ప్రయాగం’ జరపడంతో విదేశీ కొనుగోలుదారులకు విశ్వాసాన్ని కలిగిస్తున్నాయని డిఆర్డిఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ చెబుతున్నారు. భారత దేశ రక్షణ ఎగుమతులు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి.  భారతదేశం 2024–25  సంవత్సరానికి రూ. 23,622 కోట్లు ($ 2.76 బిలియన్) విలువైన రక్షణ ఎగుమతులను నమోదు చేసింది. ఇది 2023–24తో పోల్చితే 12.04% ఎక్కువ. ఇప్పటికే భారత కంపెనీల భాగస్వామ్యంతో రక్షణ ఉత్పత్తుల్ని తయారు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు వస్తున్నాయి. రాఫెల్ యూనిట్ కూడా ఇండియాలో నిర్మిస్తున్నారంటే భారత్ స్వయం సమృద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
 అంతే కాదు భారత్  భౌగోళికపరమైన ప్లస్ పాయింట్లు కూడా ఉన్నాయి.  “ఇండో పసిఫిక్”  వాణిజ్యంలో బారత్ తనదైన ముద్ర వేస్తోంది.   హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం  పశ్చిమ, మధ్య  ప్రాంతం ఇండో-పసిఫిక్ ప్రాంతం.   ప్రపంచ వాణిజ్యంలో 50% కంటే ఎక్కువ జరిగే సముద్ర మార్గాలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వున్నాయి. మలక్కా జలసంధి ద్వారా సంవత్సరానికి 100,000 ఓడలు దాటుతాయి.    
 
అమెరికా నేతృత్వంలో జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా దేశాల కూటమి ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యం వహిస్తోంది. అమెరికా ఉద్దేశ్యపూర్వకంగానే భారత్ ను ఇందులో కలపలేదు.  కానీ ఇప్పుడు భారత విషయంలో ప్రపంచదేశాల దృష్టి మారింది.  గత పదేళ్ల కాలంలో ఆర్ధిక రంగంలో వృద్ధి ప్రభావం. ఆర్ధికంగా 10 వస్ధానం నుంచి 4 వ స్థానానికి చేరుకున్న భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం  గుర్తిస్తోంది. 
 
అందుకే  అమెరికాకు ప్రాధాన్యం తగ్గిస్తున్న భారత్ ఇదే ప్రాంతంలోని తైవాన్ తో వాణిజ్యం, ఫిలిప్పీన్స్ తో మిసైల్స్ సరఫరా, జపాన్ తో టెక్నాలజీ సప్లైస్, వియత్నాంతో సైనిక సహకారం, ఇండోనేషియాతో సముద్ర భద్రత ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతటితో ఆగడం లేదు.  రష్యా ప్రతిపాదించిన రష్యా, ఇండియా, చైనా (ఆర్ఐసి) ప్రతిపాదన మరోసారి తెరమీదికి వచ్చింది.  ఈ మూడు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక,  సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఏర్పాటైన ఒక అనధికారిక ఏర్పాటు. 
 
దీన్ని అధికారికం చేస్తే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటి వరకూ ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని పూర్తిగా గండికొట్టేయవచ్చు.  ప్రపంచ జనాభాలో ఈ మూడుదేశాల జనాభా 36 శాతం. అలాగే ప్రపంచ వాణిజ్యంలో ఈ మూడుదేశాల వాటా 37 శాతం. ఆర్ఐసి బలపడితే  అమెరికా పని ఏమవుతుందో చెప్పాల్సిన పని లేదు. అంటే భారత్ దీర్ఘకాలిక దృష్టితో ముందడుగువేస్తోంది.
నిజానికి ట్రంప్ సుంకాలు విధించింది భారత్ పై కాదు.  అమెరికా ప్రజలపై . కానీ భారత వస్తువులపై విధించారు.  అంటే  భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు  చెక్స్‌టైల్స్, ఆభరణాలు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్  వంటి  ధరలను పెంచుతుంది. ఈ సుంకాలు దిగుమతిదారులు చెల్లించినప్పటికీ, ఖర్చు వినియోగదారులకు బదిలీ అవుతుంది, ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.
 
 2025లో అన్ని సుంకాలు వల్ల సగటు అమెరికా కుటుంబానికి  సంవత్సరానికి  3,800 డాలర్ల నష్టం ఏర్పడుతుంది.  భారత్ సుంకాలు భాగమైన ఏప్రిల్ 2 ప్రకటన వల్ల మాత్రమే  2,100 డాలర్ల నష్టం జరుగుతుంది. అమెరికాలో దిగువ ఆదాయ వర్గాల పై   1,700 డాలర్ల ఎక్కువ భారం పడుతుంది. దీని వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది.  ప్రజలు ఆర్థిక ఒత్తిడికి గురవుతారు.  టారిఫ్‌ల వల్ల  బిలియన్ డాలర్ల ఖజానాకు వచ్చి పడుతున్నాయని ట్రంప్ సంతోషపడుతున్నారు. కానీ అవి కడుతోంది తమ దేశ ప్రజలే అని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. అవి ఆయన తెలివితేటలు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్యదినోత్సవం ప్రసంగంలో దేశ స్వయంసమృద్ధి కోసం ఒకరికి తలవంటాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. స్వయం సమృద్ధి అంటే సమున్నతంగా ఉండటం. ప్రపంచ దేశాలకు లేనన్ని వనరులు భారత్‌కు ఉన్నాయి. అంతకు మించి ప్రపంచదేశాలన్నీ ఎదుర్కొంటున్న మానవ వనరుల కొరత మన  దేశానికి లేదు. మన ఆలోచనలే పెట్టుబడిగా ఇప్పుడు ప్రపంచ అవసరాలు తీర్చేందుకు మనపై ప్రపంచ మార్కెట్లు ఆధారపడేందుకు మనం ఉత్పత్తులు అందించవచ్చు. సేవల రంగాన్ని విస్తరించవచ్చు.  
 
ట్రంప్ లాంటి వాళ్లు టారిఫ్‌లు ఎంత ఎక్కువ వేసినా భారత్ కు ఇబ్బంది తాత్కాలికమే అవుతుంది. కొత్త మార్కెట్లు భారతీయ వ్యాపారులకు అందుబాటులోకి వస్తాయి.  ఈ సవాళ్లు భారతదేశానికి ఎగుమతులను మెరుగుపరచడానికి, భౌగోళికంగా వైవిధ్యభరితమైన మార్కెట్లను అన్వేషించడానికి అవకాశం ఇస్తాయని మార్కెట్ వర్గాలంటున్నాయి. 
ట్రంప్ టారిఫ్‌లు స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టేందుకు భారతదేశానికి అవకాశం కల్పిస్తాయి.
 
అమెరికాపై ఆధారపడే వాణిజ్యం కూడా తగ్గితే భవిష్యత్తులో భారత్ ను బ్లాక్ మెయిల్ చేయడానికీ అవకాశం ఉండదు.  అందుకే  ట్రంప్ ను అలా వదిలేసి .. భారత్ తన పని తాను చూసుకోవాలన్న నిర్ణయం అత్యుత్తమంగా ఉంటుంది. యాభై శాతం కాదు..మరో వంద శాతం టారిఫ్‌లు వేసుకున్నా..  భారత్  గట్టిగా నిలబడగలదు.  భారత ఆత్మగౌరవం కాపాడుకోగలదు. రేపు ప్రపంచానికి మార్గదర్శిగా నిలవగలదు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధృడమైన విధానాలు, భారత ప్రజల సంకల్పం దీన్ని నిజం చేస్తుంది.