
అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో చైనాను భారత్ దాటేసింది. ఈ ఏడాది(2025) ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో అమెరికా చేసుకున్న స్మార్ట్‌ఫోన్ల దిగుమతుల్లో 44 శాతం వాటా భారత్‌దేనని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) వెల్లడించింది. 2024 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగుమతుల్లో భారత్ వాటా కేవలం 13 శాతమేనని గుర్తు చేసింది.
వాణిజ్య వ్యవహారాల అధ్యయన సంస్థ ‘కెనాలిస్’ నివేదిక ప్రకారం 2024 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో అమెరికా స్మార్ట్‌ఫోన్ దిగుమతుల్లో చైనా వాటా 61 శాతం ఉండగా, ఈ ఏడాది అదే త్రైమాసికంలో డ్రాగన్ వాటా 25 శాతానికి పరిమితమైంది. భారత ప్రభుత్వం అమలుచేస్తున్న మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి పథకాల వల్లే దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగం చైనాను మించిన ఫలితాలను సాధించింది.
మునుపెన్నడూ లేని విధంగా వివిధ అధునాతన పారిశ్రామిక రంగాల్లోనూ భారత్ పురోగతిని సాధించడానికి ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలే దన్నుగా నిలుస్తున్నాఊ. గత దశాబ్ద కాలంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో జరిగిన పెను మార్పుల వల్లే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో ఇంతటి పురోగతిని భారత్ నమోదు చేస్తుంది.
గత పదేళ్లలో భారత్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఫోన్ల ఎగుమతులు రూ.38వేల కోట్ల నుంచి రూ.3.27 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ వ్యవధిలో భారత్‌లో ఫోన్ల ఉత్పత్తి విలువ రూ.18వేల కోట్ల నుంచి రూ.5.45 లక్షల కోట్లకు పెరగగా, వాటి ఎగుమతుల విలువ రూ.1500 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. అంటే భారతీయ ఎగుమతులు ఏకంగా 127 రెట్లు పెరిగాయి.
2014-2015లో భారత్‌లో ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి విలువ రూ.1.9 లక్షల కోట్లు ఉండగా, 2024-2025 నాటికి ఆ విలువ కాస్తా రూ.11.3 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విభాగంలో 6 రెట్ల వృద్ధి నమోదైంది. 2014-2015 నాటికి దేశంలో రెండే ఫోన్ల తయారీ యూనిట్లు ఉండగా, 2024-2025 నాటికి వాటి సంఖ్య 300కు పెరిగింది. అంటే తయారీ యూనిట్ల సంఖ్య 150 రెట్లు పెరిగింది.
దీనివల్ల విదేశాల నుంచి భారత్‌కు స్మార్ట్‌ఫోన్లను దిగుమతి చేసుకోవడం పూర్తిగా తగ్గిపోయింది. 2014-2015 నాటికి భారత్‌లో విక్రయించే ఫోన్లలో 75 శాతం భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. పదేళ్ల తర్వాత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇప్పుడు కేవలం 0.02 శాతం ఫోన్లనే భారత్ దిగుమతి చేసుకుంటోంది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్లపై 18 శాతం వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను విధిస్తుండగా, దాన్ని 5 శాతానికి తగ్గించాలని స్మార్ట్‌ఫోన్ల తయారీదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనివల్ల తమకు ఆర్థిక మద్దతు లభిస్తుందని, ఫలితంగా మార్కెట్‌లో మరింత చౌకగా ఫోన్లు అందుబాటులోకి వస్తాయని వారు అంటున్నారు. జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తే, ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ ఫోన్ల ధరలు గణనీయంగా తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
More Stories
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’
దసరా, దీపావళి కానుక- ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం