
భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలను హైడ్రోజన్ భర్తీ చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో రవాణా, పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు, బయో ఇంధనం, హైడ్రోజన్‌పై ఆధారపడి ఉంటుందని గడ్కరీ వివరించారు.
హైడ్రోజన్ రోడ్డు రవాణాకు మాత్రమే పరిమితం కాకుండా రైల్వే, విమానయాన రంగంలో ఉపయోగించనున్నట్లు చెప్పారు. రైళ్లు హైడ్రోజన్‌తో నడుస్తాయని, విమానాలు హైడ్రోజన్‌తోనే ఎగురుతాయని పేర్కొన్నారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక అంతమవుతుందని పేర్కొంటూ భారతదేశం ఇటీవల జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమేకర్‌గా అవతరించిందని తెలిపారు.
అమెరికా ఆటో పరిశ్రమ విలువ దాదాపు రూ.78 లక్షల కోట్లు, చైనా విలువ రూ.49 లక్షల కోట్లు. భారతదేశం విలువ రూ.22 లక్షల కోట్లు అని గడ్కరీ చెప్పారు. కొద్దిరోజుల కిందట మెర్సిడెస్ గ్లోబల్ చైర్మన్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ మెర్సిడెస్ కార్లను తయారు చేస్తుందని తనతో చెప్పారని ఆయన పేర్కొన్నారు.
విద్యుత్, బయో ఇంధనం, హైడ్రోజన్ టెక్నాలజీని పెద్ద ఎత్తున అవలంబిస్తే, భారతదేశం కార్బన్ న్యూట్రాలిటీ వైపు వేగంగా అడుగులు వేయడమే కాకుండా ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణాన్ని కాపాడడం, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని గడ్కరీ చెప్పారు. నేడు హైడ్రోజన్ ధర కిలోకు 5-6 డాలర్లు ఉందని గడ్కరీ చెప్పారు. కానీ, దాన్ని కిలోకు డాలర్‌కు తగ్గిస్తే భారతదేశం చమురు ఉత్పత్తి చేసే దేశాల హోదాను కూడా సాధించగలదని తెలిపారు.
దాంతో భారతదేశాన్ని ఇంధన దిగుమతి చేసుకునే దేశం నుంచి ఇంధన ఎగుమతి చేసే దేశంగా మార్చవచ్చని గడ్కరీ చెప్పారు. హైడ్రోజన్‌ను స్వీకరించడంలో అతిపెద్ద సమస్య ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయడమేనని పేర్కొంటూ ఈ రంగాల్లో వెంటనే, పెద్ద ఎత్తున పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
More Stories
బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు