
తిరుమల తిరుపతి దేవస్థానంపైనా తనపైనా విమర్శలు చేస్తున్న సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు జారీ చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. సాక్షి ద్వారా ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దమ్ముంటే తిరుమల వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. జగన్ పాలనలో తిరుమల ప్రవిత్రతను దెబ్బతీసిన వారే ఇప్పుడు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి చేయని అక్రమం లేదని పేర్కొంటూ ఆయన మూలంగానే తిరుమల ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే టీటీడీ పాలన గాడిన పడిందని గూగుల్, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో భక్తులకు సులువైన దర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ నాయుడు తెలిపారు.
టీటీడీలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు, వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ కింద పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ అలానే అన్యమత ప్రచారాల్లో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని, అందుకోసం అన్నదానం కోసం రూ.4 కోట్లు కేటాయించామని తెలిపారు.
గత ప్రభుత్వ పాలనలో 12 మంది వైఎస్సార్సీపీ వర్గీయులకు తిరుమలలో హోటళ్లు ఇచ్చారని పేర్కొంటూ గతంలో తిరుమలలో హోటళ్ల కేటాయింపు మాఫియాలా తయారైందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ-టెండర్ల ద్వారా హోటళ్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే ఇక్కడ కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తామని, అలానే శ్రీవాణి దర్శన సమయాల వేళలు మారుస్తామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకుని సాయంత్రం దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీవారి దర్శనాలు, ప్రసాదాల విషయంలో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు. ఏడాది కాలంలో 30 వేల నకిలీ వెబ్‌సైట్లను క్రాష్ చేశామని, అలానే భద్రతా చర్యల్లో భాగంగా అలిపిరిలో స్కానర్లు కూడా అప్‌డేట్ చేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ పేర్కొన్నారు.
గతంలో వీఐపీ దర్శనం ఉదయం 10 గంటలకు ఉండటంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వీఐపీ దర్శనాలు ఉదయం 8 నుంచి 8.30 గంటలకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీటీడీ పరిధిలోని 90 శాతం అటవీ ప్రాంతాన్ని 110 శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇంకా తిరుమల కల్యాణకట్టలో అత్యాధునిక పరికరాలు వాడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
తీర ప్రాంతాల్లో మతమార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని అలా జరగకుండా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 320 ఆలయాలు నిర్మించామని చెబుతూ మరో 500 నుంచి 1000 ఆలయాలు నిర్మించాలని, ప్రతి రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీటీడీ ఛైర్మన్ వివరించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు