ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌
విపక్ష ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌కు ఇవాళ చివరి తేదీ కావడంతో కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.  నామినేషన్‌ కార్యక్రమానికి  జస్టిస్​ సుదర్శన్ రెడ్డి వెంట ఇండియా బ్లాక్ నేతలు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర పార్టీల నాయకులు అఖిలేశ్ యాదవ్‌, శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ హాజరయ్యారు. బీ సుదర్శన్‌ రెడ్డి నామినేషన్‌ను బలపరుస్తూ సోనియా సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జస్టిస్ సుదర్శన్​ రెడ్డి మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తిగత పోటీ కాదని తెలిపారు. “ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం ఒక వ్యక్తి గురించి కాకుండా, పార్లమెంట్‌ నిష్పాక్షికంగా నడవడం, విభిన్న అభిప్రాయాలను గౌరవించడం, ప్రజాస్వామ్య సంస్థలు స్వతంత్రంగా, న్యాయంగా ప్రజల కోసం పనిచేయడం వంటి భారత్ ఆలోచనను పునరుద్ధరించడం” అని చెప్పారు. 

“ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే పక్షంలో నిష్పాక్షికత, గౌరవం, సంభాషణ, మర్యాదతో నా బాధ్యతలను నిర్వర్తిస్తా. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి నా నామినేషన్ దాఖలు చేయడం గౌరవంగా భావిస్తున్నా. రాజ్యాంగంపై విశ్వాసంతో, ప్రజలపై ఆశతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నా. మన ప్రజాస్వామ్య స్పూర్తి ఎల్లప్పుడూ మనందరినీ నడిపిస్తుందని నమ్ముతున్నా. రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి, ప్రజాస్వామ్య పార్లమెంటరీ సంప్రదాయాలను రక్షించే బాధ్యత కలిగి ఉంటా” అని హామీ ఇచ్ఛారు.

ఎన్​డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ కూడా బుధవారమే నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఎన్​డీఏ పార్టీ నేతలు హాజరయ్యారు.