
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొన్ని నూతన బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేబినెట్ మంత్రులు ఎవరిదైనా 30 రోజులకు మించి కస్టడీలో ఉంటే వారి పదవులు తాత్కాలికంగా రద్దు చేయాలనే నిబంధన కలిగిన ఈ బిల్లుపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇది రాజకీయంగా అసమానతలు కలిగించవచ్చని వారు భావిస్తున్నారు. అయితే, ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ భిన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ సమావేశం వాయిదా పడిన అనంతరం శశి థరూర్ మాట్లాడుతూ, “ఎవైనా 30 రోజులు జైలులో ఉంటే, వారు మంత్రి పదవిలో ఎలా కొనసాగగలరు? ఇది చాలా సాదారణమైన, తార్కికమైన విషయం,” అని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలు ఆయన పార్టీ అధికారిక వైఖరికి విరుద్ధంగా ఉండడం గమనార్హం. ఈ అంశంపై విపక్షాలు ఒకతాటిపై ఉండగా, శశి థరూర్ స్పందన అందుకు భిన్నంగా ఉండటం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది. అయితే, బిల్లును తాను పూర్తిగా చదవలేదని, తన అభిప్రాయం తుది నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. బిల్లులోని వివిధ అంశాలపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జెపిసి) పంపి, లోతుగా అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే యోచన ప్రభుత్వ వర్గాల్లో ఉన్న నేపథ్యంలో, శశి థరూర్ దానిని స్వాగతించారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని, ప్రజల అభిప్రాయాలకు అవకాశం కల్పించే విధంగా ఉందని చెప్పారు. బిల్లును రద్దు చేయాలని కాదు, కానీ చర్చించి, సమర్థవంతంగా మార్చాలని ఆయన సూచించిన తీరు, రాజకీయ శైలి పరంగా విభిన్నంగా కనిపిస్తుంది.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది