భారత్ కు రష్యా చమురు కొనుగోలుపై 5 శాతం రాయితీ!

భారత్ కు రష్యా చమురు కొనుగోలుపై 5 శాతం రాయితీ!

అమెరికా సుంకాల మోత మోగిస్తున్న వేళ, భారత్ కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముడి చమురు కొనుగోళ్లపై భారత్ కు 5 శాతం మేర తగ్గింపు (డిస్కౌంట్) ఇస్తామని ప్రకటించింది. వాస్తవానికి అగ్రరాజ్యం అమెరికా నుంచి నిరంతర ఒత్తిడి, ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ కు రష్యా ఈ ఆఫర్ ఇచ్చింది. దీనితో సగటున 5 శాతం డిస్కౌంట్‌తో భారత్‌ అవసరాల్లో 40 శాతం చమురును సరఫరా చేస్తున్నారు.

“అమెరికా నుంచి రాజకీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇక డిస్కౌంట్ల విషయానికి వస్తే, అది పూర్తిగా వాణిజ్య రహస్యం. సాధారణంగా వాణిజ్య భాగస్వాముల మధ్య 5 శాతం వరకు తగ్గింపు ఇవ్వాలనే చర్చలు జరుగుతుంటాయి. కనుక ఇరుదేశాల మధ్య జరిగే చర్చలకు లోబడి ఈ తగ్గింపు 5 శాతానికి కాస్త అటుఇటుగా ఉంటుంది” అని రష్యా డిప్యూటీ ట్రేడ్ ప్రతినిధి గ్రీవా తెలిపారు.

రష్యన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “బయట నుంచి అనేక సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ, మా (భారత్-రష్యా) సంబంధాలపై మాకు నమ్మకం ఉంది. కనుక ఇరుదేశాల మధ్య ఇంధన సహకారం కొనసాగుతుందనే నమ్మకం ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్, ఆ కోపాన్ని భారత్పై చూపిస్తున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ఆసరాగా తీసుకుని, యుద్ధానికి భారత్ ఫండింగ్ చేస్తోందని పసలేని ఆరోపణలు చేశారు. అక్కడితో ఆగకుండా భారత్ పై 50 శాతం మేర సుంకాల భారాన్ని పెంచారు. 

చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. కానీ దానిని ఏమీ చేయలేక, కేవలం భారత్ పైననే తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. “రష్యా చమురుకు గ్లోబల్ క్లియరింగ్ హౌస్ గా భారత్ పనిచేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి కావలసిన డాలర్లను మాస్కోకు అందిస్తోంది” అని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు.

భారత్‌-రష్యా  మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోను కొనసాగుతుందని రష్యా దౌత్యవేత్త రోమన్‌ బబుష్కిన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీ సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోందని పేర్కొంటూ  భారత్‌తో సంబంధాలపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శించారు.

వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వాషింగ్టన్‌ను ఆయన దెప్పిపొడిచారు. రష్యా భవిష్యత్తులోను భారత్‌పై అలాంటి చర్యలు తీసుకోదని, భారత్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని బబుష్కిన్‌ చెప్పారు. అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు భారత్‌ ఇబ్బంది పడాల్సివస్తే రష్యా మార్కెట్లు స్వాగతం పలుకుతాయని భరోసా ఇచ్చారు.