1971 నుంచి పాక్ అదే దుర్మార్గపు ధోరణి

1971 నుంచి పాక్ అదే దుర్మార్గపు ధోరణి
భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదికగా దాయాది పాకిస్థాన్‌ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలపై లైంగిక హింస విషయంలో పాకిస్తాన్ సిగ్గుమాలిన రికార్డును కలిగి ఉందని, అలాంటి దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఘాటుగా విమర్శించింది.  ఇరుదేశాల నడుమ సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింస బాధితులకు సహాయంపై జరిగిన చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ అనవసరంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ ధీటుగా బదులిచ్చింది.
భారత శాశ్వత ప్రతినిధి బృందం తరఫున ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ మాట్లాడుతూ 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం మహిళలపై జరిపిన అఘాయిత్యాలను గుర్తుచేశారు.  “1971లో తూర్పు పాకిస్థాన్‌లో పాక్ సైన్యం మహిళలపై జరిపిన ఘోరమైన లైంగిక నేరాలు చరిత్రలో ఒక సిగ్గుచేటు అయిన రికార్డు. దాదాపు నాలుగు లక్షల మంది మహిళలు వారి అరాచకాలకు బలయ్యారు” అని ఆయన దుయ్యబట్టారు.
ఆనాటి దుర్మార్గపు ధోరణి నేటికీ పాకిస్థాన్‌లో శిక్షార్హమైన రీతిలో నిరాటంకంగా కొనసాగుతోందని ఎల్డోస్‌ ఆరోపించారు.  ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారే నేడు న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. వారి ద్వంద్వ నీతి, కపటత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని పున్నూస్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై కిడ్నాప్‌లు, బలవంతపు మత మార్పిడులు, లైంగిక హింస, గృహ హింస వంటివి నిరంతరం జరుగుతున్నాయని గుర్తు చేశారు.

ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదికలే ధ్రువీకరిస్తున్నాయని ఎల్డోస్‌ చెప్పారు. బలూచిస్థాన్‌లో మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ‘ఔరత్ మార్చ్’‌లో పాల్గొన్న వారిని సైతం బలవంతంగా మాయం చేయడం, చిత్రహింసలకు గురిచేయడం వంటి ఘటనలను ఐరాస నివేదికలు ప్రస్తావించాయని ఎల్డోస్‌ పున్నూస్ సభ దృష్టికి తెచ్చారు. మానవ హక్కులపై కబుర్లు చెప్పే పాకిస్థాన్ ముందుగా తమ దేశంలో మహిళలు, మైనారిటీల భద్రతపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.