జీఎస్టీ సంస్కరణలు ‘ఆత్మనిర్భర్’ భారత్ లో ఓ ముందడుగు

జీఎస్టీ సంస్కరణలు ‘ఆత్మనిర్భర్’ భారత్ లో ఓ ముందడుగు
జీఎస్టీ సంస్కరణలు భారతదేశాన్ని ‘ఆత్మనిర్భర్’ చేయడానికి ఒక ముందడుగు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల విషయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే తాము ముందుకెళతామని  ఆమెచెప్పారు. రేట్ల హేతుబద్ధీకరణ, ఇన్సూరెన్స్‌ ప్రీమియంపై ట్యాక్స్‌, పరిహార సెస్సు అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందాల(జీవోఎం)తో ఆమె భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని మంత్రుల బృందానికి వివరించారు. నెక్ట్స్-జన్ జీఎస్టీ సంస్కరణల ద్వారా పన్ను రేట్లు తగ్గించడం, వ్యాపారాలపై భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని మంత్రుల బందాలకు నిర్మలా సీతారామన్ తెలిపారు.  ‘జీఎస్టీ సంస్కరణలపై కేంద్రం ప్రతిపాదన 3 స్థంభాలపై ఆధారపడింది. అవి : నిర్మాణాత్మక సంస్కరణలు, రేటు హేతుబద్దీకరణ, జీవన సౌలభ్యం’ అని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ రేటు హేతుబద్దీకరణపై తదుపరి జీవోఎం ఆగస్టు 21న జరగనుంది.

అందులో జీఎస్టీ శ్లాబ్లు, రేట్లలో మార్పులు, చేర్పులు సూచించే అవకాశం ఉంది. నూతన జీఎస్టీ ప్రకారం, ఇకపై 5 శాతం, 18 శాతం శ్లాబ్లు మాత్రమే ఉండనున్నాయి. కొన్ని హానికర ఉత్పత్తుల(సిన్ గూడ్స్)తో తోపాటు, నిర్దేశిత 5-7 వస్తువులపై మాత్రమే ప్రత్యేకంగా 40 శాతం పన్ను రేటు విధించాలనే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది.  “రానున్న రోజుల్లో రాష్ట్రాలతో ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. నెక్ట్స్-జెన్ జీఎస్టీ సంస్కరణలు- సహకార సమాఖ్య స్ఫూర్తితో అమలు చేయాలని కేంద్రం నిబద్ధతతో ఉంది” అని నిర్మలా సీతారామన్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

అలాగే అసెస్మెంట్ సెస్ సహా ఆరోగ్యం, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను రేట్లు తగ్గించడంపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఆమె తెలిపారు. ప్రస్తుత జీఎస్టీలో 5, 12, 18, 28 శ్లాబులు ఉన్నాయి. ఆహార, అత్యవసర వస్తువులపై జీరో లేదా 5 శాతం పన్ను రేటు ఉండగా, లగ్జరీ, డీమెరిట్ వస్తువులు 28 శాతం శ్లాబుల్లో ఉన్నాయి. పైగా వీటిపై సెస్ కూడా ఉంటుంది.

ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, ‘ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తే, సంవత్సరానికి సుమారుగా రూ.85వేల కోట్ల మేర ఆదాయ నష్టం (రెవెన్యూ లాస్) జరగవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 1 నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలైతే, ప్రభుత్వానికి రూ.45వేల కోట్ల మేర రెవెన్యూ లాస్ ఏర్పడవచ్చు’ అని తెలిపింది.