భారత అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్‌ పరీక్ష విజయవంతం

భారత అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్‌ పరీక్ష విజయవంతం
భారత్ తన అణ్వాయుధ సామర్థ్యం గల మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ని విజయవంతంగా పరీక్షించింది. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం  బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-5ని పరీక్షించినట్లు తెలిపింది. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టెస్ట్‌‌లో అగ్ని-5 క్షిపణికి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను ఛేదించినట్లు స్పష్టం చేసింది. 
 
భవిష్యత్తులో ఈ అగ్ని-5 క్షిపణి వ్యవస్థల సంసిద్ధత కోసం జరిపిన సాధారణ పరీక్ష ఇది అని రక్షణ అధికారులు వెల్లడించారు. ఈ అగ్ని-5 బాలిస్టిక్ మిసైల్ పరిధి దాదాపు 5 వేల కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు. 7500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే మరో బాలిస్టిక్ మిసైల్‌ను తయారు చేస్తున్నట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది.
 
ఇక చివరిసారి గతేడాది మార్చి 11వ తేదీన ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 ఎంఐఆర్‌వీ మిసైల్‌ను భారత్‌ టెస్ట్ చేసింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ఈ అగ్ని-5 అధునాతన మిసైల్‌ను ‘మల్టీపుల్‌ ఇండిపెండెంట్‌ టార్గెటబుల్‌ రీ-ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్వి)’ టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపారు. 
 
ఒకే ఒక్క మిసైల్ సాయంతో అనేక వార్‌హెడ్లను ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జులైలోనే అగ్ని-1 స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని కూడా పరీక్షించడం విశేషం.  అగ్ని-5 అనేది ఒక భూ ఆధారిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసింది. 5 వేల కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను అగ్ని-5 మిసైల్ ఛేదించగలదు. 
 
దీన్ని మరింత డెవలప్ చేసి 7,500 కిలోమీటర్ల పరిధి గల కొత్త వేరియంట్‌ను తయారు చేసే పనిలో ప్రస్తుతం డీఆర్‌డీఓ పడింది. అగ్ని-5 క్షిపణికి ఒకేసారి అనేక అణ్వాయుధాలను మోసుకెళ్లి వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించే సామర్థ్యం కలదు. 2024 మార్చి 11వ తేదీన తమిళనాడులోని కల్పక్కం నుంచి అగ్ని-5 తొలి ఎంఐఆర్‌వీ పరీక్షను నిర్వహించింది.  రానున్న రోజుల్లో ఈ అగ్ని-5 క్షిపణికి బంకర్-బస్టర్ బాంబ్ టెక్నాలజీని జోడించి శత్రువుల బలమైన లక్ష్యాలను కూడా ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కల్పించాలని డీఆర్‌డీఓ యోచిస్తోంది.
కాగా, అగ్ని-5 మిసైల్ట్ టెస్ట్‌ను భారత్ సక్సెస్ చేయడం ఇప్పుడు పాకిస్తాన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.  పాకిస్తాన్‌కు చెందిన థింక్ ట్యాంక్ స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్ భారత్ క్షిపణి ప్రయోగం ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లను తీవ్రంగా హెచ్చరించింది. 
 
2016లో భారత్ మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్‌లో చేరిది. ఆ తర్వాతే అధునాతన వ్యవస్థలకు మోక్షం లభించి క్షిపణి అభివృద్ధి వేగవంతం అయిందని స్ట్రాటజిక్ విజన్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.  భవిష్యత్తులో 8 వేల కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించే మిసైల్స్‌ను భారత్ తయారు చేస్తే అవి వాషింగ్టన్, మాస్కో, బీజింగ్ వంటి నగరాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదని వెల్లడించింది.