సరిహద్దులో శాంతి లక్ష్యంగా మోదీ, వాంగ్ యూ చర్చలు

సరిహద్దులో శాంతి లక్ష్యంగా మోదీ, వాంగ్ యూ చర్చలు
షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ (స్కో) సమావేశాల్లో పాల్గొనాలంటూ చైనా నుంచి పిలుపు అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. మంగళవారం ఢిల్లీలో ప్రధాని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా మంత్రితో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధాని చర్చించారు.  అంతేకాదు ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి స్థాపన దిశగా చర్యలు తీసుకోవాలనే అంశాన్ని కూడా మోదీ, వాంగ్ యూల మధ్య ప్రస్తావనకు వచ్చింది.

“చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూను కలవడం చాలా సంతోషంగా ఉంది. నిరుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కజాన్‌లో భేటీ అయినప్పటి నుంచి భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కనిపిస్తుంది. ఇరుదేశాలు తమతమ ప్రయోజనాలు, సున్నితమైన విషయాలను పరస్పరం గౌరవించుకుంటూ సాగుతున్నాయి” అని ప్రధాని ఎక్స్ లో తెలిపారు.

“స్కో సమావేశం సమయంలో తియాంజిన్‌లో జరుగబోయే తదుపరి మా భేటీకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. భారత్, చైనాల మధ్య ద్రుఢమైన, నిర్మాణాత్మకమైన బంధాలు ఆసియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంతోషాల స్థాపనలో కీలకమవుతాయి” అని మోదీ పేర్కొన్నారు.  చైనాలోని టియాంజిన్​లో జరగనున్న ఎస్​సీఓ శిఖరాగ్ర సమావేశానికి మోదీని ఆహ్వానిస్తూ, ఆ దేశాధ్యక్షుడు జిన్​పింగ్ పంపించిన సందేశాన్ని అందజేశారు. దీనితో తనకు ఆహ్వానం పంపినందుకు జిన్​పింగ్​కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్​సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు.

భారత్, చైనా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి భారత్​ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రధానితో భేటీకి ముందు చైనా మంత్రి వాంగ్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశం అయ్యారు.