సంబంధాల పునరుద్ధరణకై భారత్ – చైనా సంకేతాలు

సంబంధాల పునరుద్ధరణకై భారత్ – చైనా సంకేతాలు
 
తమ మధ్య సంప్రదింపుల యంత్రాంగాన్ని పునరుద్దరించాలని, రెండు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించాలని, వాణిజ్యం-పెట్టుబడి సంబంధాలను ప్రోత్సహించుకోవాలని అంగీకరించడం ద్వారా భారత్- చిన్నా తమ మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే సంకేతాలను మంగళవారం ఇచ్చాయి.  విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రకారం, రెండు దేశాలు “స్నేహపూర్వక సంప్రదింపుల” ద్వారా సరిహద్దు ప్రాంతాలలో శాంతి , ప్రశాంతతను కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాయి. ఒకరి ఆందోళనలను మరొకరు పరిష్కరించుకుంటాయి. 
రెండు దిశలలో పర్యాటకులు, వ్యాపారాలు, మీడియా, ఇతర సందర్శకులకు వీసాల సౌకర్యాన్ని కల్పించడానికి కూడా వారు అంగీకరించారు.  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి అధ్యక్షతన సరిహద్దు సమస్యపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు న్యూఢిలో జరిగినప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  సహకారాన్ని పెంపొందించడానికి, పరస్పర ఆందోళనలను పరిష్కరించడానికి మూడు నియమించబడిన పాయింట్ల వద్ద సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించడానికి, బహుళ సంప్రదింపుల యంత్రాంగాలు- మార్పిడులను పునరుద్ధరించడానికి రెండు దేశాలు కూడా అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
భారతదేశం, చైనా నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వం ద్వైపాక్షిక సంబంధాల పెరుగుదలలో కీలకమైన, భర్తీ చేయలేని పాత్ర పోషిస్తుందని ఇరుపక్షాలు స్పష్టం చేశాయి. రెండు దేశాలు తమ అభివృద్ధి సామర్థ్యాన్ని పూర్తిగా గ్రహించడానికి స్థిరమైన, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సహకార సంబంధం అవసరమని వారు అంగీకరించారు.  తమ నాయకుల మధ్య కుదిరిన కీలక ఏకాభిప్రాయాన్ని నిజాయితీగా అమలు చేయవలసిన అవసరాన్ని పునరుద్ఘాటిస్తూ, భారతదేశం-చైనా సంబంధాల స్థిరమైన, దృఢమైన, స్థిరమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. 

భారత్ – చైనా దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తెలిపారు. రెండు దశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన తొలగినప్పటి నుంచి రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొందని, దీనివల్ల రెండు దేశాలూ ప్రయోజనం పొందాయని దోవల్ పేర్కొన్నారు.

“సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి. శాంతి, సామరస్యం నెలకొన్నాయి. మన ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ తర్వాత ఈ కొత్త వాతావరణం ఏర్పడింది. అప్పటి నుంచి ఇరు దేశాలు ఎంతో లబ్ధి పొందాయి” అని దోవల్ చెప్పారు. 
 
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా రెండు దేశాల సంబంధాల్లో ఎదురైన ఆటుపోట్లు ఎవరికీ మంచివి కావని స్పష్టం చేశారు. గత ఏడాది మోదీ, జిన్‌పింగ్ భేటీ ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి సరైన దిశానిర్దేశం చేసిందని, సరిహద్దు సమస్య పరిష్కారానికి ఊతమిచ్చిందని తెలిపారు.  చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు ఆరోగ్యంగా,సుస్థిరంగా వుంటే ఇరు దేశాల సుదీర్ఘకాల ప్రయోజనాలకు మంచిదని తెలిపారు. 
ఇదే అంశాన్ని చరిత్ర, వాస్తవ పరిస్థితులు మనకు మరోసారి నిరూపించాయని వాంగ్‌ పేర్కొన్నారు.  “సరిహద్దుల్లో ఇప్పుడు నెలకొన్న స్థిరత్వం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రధాని మోదీ మా ఆహ్వానం మేరకు ఎస్‌సీఓ సదస్సు కోసం చైనాకు రానుండటాన్ని మేం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. 
 
కాగా 2020 ఏప్రిల్-మే నెలల్లో లఢక్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద మొదలైన సైనిక ప్రతిష్టంభన, ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా ఇరు దేశాల సంబంధాలు ఆరు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.  2024 అక్టోబర్ 21న ప్రతిష్టంభనకు తెరపడటంతో ఆ తర్వాత రెండు రోజులకే మోదీ-జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశమై సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలని నిర్ణయించారు. తాజా చర్చల్లో సరిహద్దుల్లో నమ్మకాన్ని పెంచే చర్యలపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ పర్యటన ఆఖరులో వాంగ్ యీ ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు.