ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొనడం నేరం

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో  పాల్గొనడం నేరం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ప్రకారం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో  పాల్గొనడం నేరంగా పరిగణిస్తారు. గత కొన్ని నెలలుగా దర్యాప్తు సంస్థలు అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ యాప్‌లను ప్రచారం చేసే ప్రముఖులపైనా చర్యలు తీసుకుంటున్నాయి. అనేక అక్రమ బెట్టింగ్ యాప్‌లు కోట్లాది రూపాయల మోసాలకు, పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

ఇటీవల, ఒక అక్రమ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను  ఎనిమిది గంటలకు పైగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు.  ఈ యాప్‌తో ఆయనకున్న సంబంధాల గురించి విచారణ జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా గూగుల్, మెటా వంటి సంస్థల ప్రతినిధులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. విశ్లేషణ సంస్థల అంచనాల ప్రకారం, భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది ప్రజలు వివిధ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. వీరిలో సుమారు 11 కోట్ల మంది తరచుగా వీటిలో పాల్గొంటున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు  పైగా ఉంది. ఇది ఏటా 30% చొప్పున పెరుగుతోంది. 2022 నుండి 2025 జూన్ వరకు ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం ప్లాట్‌ఫారమ్‌లను నిరోధించడానికి ప్రభుత్వం 1,524 ఆదేశాలను జారీ చేసినట్లు గత నెలలో పార్లమెంటుకు తెలిపింది.