ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గ‌ట్టిగా చెంప‌దెబ్బ

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. గ‌ట్టిగా చెంప‌దెబ్బ
 
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై   బుధవారం దాడి జ‌రిగింది. ముఖ్యమంత్రి నివాసంలో జ‌న్ సున్వాయి కార్య‌క్రమం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దాడిజ‌రిగింది. త‌న‌ స‌మ‌స్య‌ను చెప్పుకునేందుకు వ‌చ్చిన ఓ వ్య‌క్తి సీఎం రేఖా గుప్తాపై అకస్మాత్తుగా దాడి చేశాడు. ఆ వ్య‌క్తి 40 ఏళ్ల ఉంటాడ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  అతనిని గుజరాత్ లోని రాజకోట్ కు చెందిన రాజేష్‌భాయ్ కింఝిగా గుర్తించారు.
 
సీఎంపై దాడి చేసిన వ్య‌క్తిని  అక్క‌డ ఉన్న సీఎం సిబ్బంది త‌క్ష‌ణ‌మే అదుపులోకి తీసుకున్నారు. బహిరంగంగా స‌మ‌స్య చెప్పుకునేందుకు వ‌చ్చిన వ్య‌క్తి ఎందుకు దాడికి పాల్ప‌డ్డార‌న్న కోణంలో విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. గ‌ట్టిగా రెండు సార్లు ఆమె చెంప‌పై కొట్టిన‌ట్లు తెలుస్తోంది. జుట్టు ప‌ట్టుకుని మ‌రీ బాదిన‌ట్లు చెబుతున్నారు. జుట్టు ప‌ట్టి పీక‌డంతో ఆమె త‌ల‌కు గాయాలైన‌ట్లు తెలుస్తోంది.

దాడి త‌ర్వాత హుటాహుటిన ముఖ్యమంత్రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఢిల్లీలోని అత్యున్నత అధికారులు సీఎం ఇంటికి ర‌క్ష‌ణ క‌ల్పించేందుకు వెళ్లారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సీఎం రేఖా గుప్తా నేరుగా ప్ర‌జ‌ల‌తో ద‌ర్బార్ నిర్వ‌హిస్తారు. ప్ర‌తి వారం జ‌రిగే జ‌న్‌సున్వాయి కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌పం చేసుకుంటారు. సీఎంపై జరిగిన దాడిని డిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఖండించారు. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు.

డిల్లీ సీఎంపై దాడిని కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయవచ్చని, కానీ హింసకు చోటు లేదని పేర్కొన్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “వైద్యులు ఆమెను పరీక్షించారు. నేను ఆమెను కలిశాను, ఆమె బలమైన మహిళ. ఆమె తలపై స్వల్ప దెబ్బ తగిలినట్లు కనిపిస్తోంది. చెంపదెబ్బ లేదా రాళ్లు విసిరే కథలు కల్పించబడ్డాయి. రాజకీయాల్లో ఇటువంటి సంఘటనలు ఖండించదగినవి. జాన్ సున్వాయి కొనసాగిస్తారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు, కానీ ఆమె తన కార్యక్రమాలను రద్దు చేసుకోబోనని చెప్పారు” అని ఆయన తెలిపారు.

సీనియ‌ర్ బీజేపీ నేత హ‌రీశ్ ఖురానా మాట్లాడుతూ ఓ వ్య‌క్తి సీఎంపై దాడి చేశాడ‌ని, ప్ర‌స్తుతం డాక్ట‌ర్లు సీఎంకు చికిత్స చేస్తున్నార‌ని, ఆ దాడిని ఖండిస్తున్నామ‌ని తెలిపారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఆ దాడి చేశారా అన్న కోణంలో విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయన కోరారు. సీఎంను చెంప‌దెబ్బ కొట్టిన వ్యక్తి, ఆమె జుట్టును కూడా లాగేసిన‌ట్లు ఖురానా తెలిపారు. దీంట్లో రాజ‌కీయ కుట్ర ఉన్న‌ట్లు బీజేపీ ఆరోపించింది.

సీఎం రేఖా గుప్తా నిర్వ‌హిస్తున్న గ్రౌండ్‌వ‌ర్క్ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌ర్థులు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ఢిల్లీ మంత్రి మంజింద‌ర్ సింగ్ సిర్సా తెలిపారు. దాడి వెనుక కార‌ణాల‌ను తెలుసుకోవాల‌ని స్పష్టం చేశారు.  తొలుత అతడు కొన్ని పేపర్లను సీఎంకు అందించిన తర్వాత ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ ఘటనతో సీఎం రేఖా గుప్తా పూర్తిగా షాక్​లో  ఉన్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

‘ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు రేఖ గుప్తా ప్రజల మాటలను వింటున్నారు. వెనక నుంచి శబ్దం వచ్చినట్లు వినిపించింది. మేం తిరిగి చూసే సరికి పోలీసులు దాడి చేసిన వ్యక్తి తీసుకెళ్లారు’ అని ప్రత్యక్ష్ సాక్షి చెప్పారు.  మరో సాక్షి శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ, తమ ప్రాంతంలోని మురుగునీటి కాలువపై ఫిర్యాదు చేయడానికి గేటు వద్దకు వచ్చే సరికి గందరగోళం నెలకొందని, తర్వాత తెలిసింది సీఎంను ఎవరో చెంపదెబ్బ కొట్టారని వివరించాడు.