
వోల్వర్‌హాంప్టన్‌లో చోటుచేసుకున్న ఒక దారుణమైన జాత్యహంకార దాడి బ్రిటన్‌లో నివసిస్తున్న భారతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక రైల్వే స్టేషన్ బయట ముగ్గురు టీనేజర్లు ఇద్దరు సిక్కు పురుషులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి పవిత్రమైన తలపాగాలను బలవంతంగా తొలగించారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో ఈ అమానవీయ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
వైరల్ అయిన వీడియోలో బాధితులు ఇద్దరూ నేలపై పడి ఉండగా, దుండగుల్లో ఒకరు వారిని పదేపదే తన్నడం స్పష్టంగా కనిపిస్తుంది. సిక్కులకు మతపరమైన చిహ్నమైన వారి తలపాగాను కూడా నిందితులు బలవంతంగా తీసి కింద పడేశారు. కేవలం శారీరకంగా మాత్రమే దాడి చేయకుండా సిక్కుల మత విశ్వాసాలను, వ్యక్తిగత గౌరవాన్ని లక్ష్యంగా చేసుకున్న ఒక హేయమైన చర్య అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సిక్కు మతంలో తలపాగా అనేది వారి విశ్వాసానికి, గుర్తింపుకు చిహ్నం. అందుకే దానిని తొలగించడం అనేది అత్యంత అవమానకరమైన చర్యగా పరిగణించబడుతుంది. ఈ దాడి జరిగిన వెంటనే బ్రిటీష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు టీనేజర్లను అరెస్ట్ చేశారు. అయితే వారిని బెయిల్‌పై విడుదల చేయడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తామని, ఇలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోమని హామీ ఇచ్చారు.
భారతీయ సమాజం, రాజకీయ నాయకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వంతో చర్చించి, అక్కడ నివసిస్తున్న సిక్కు ప్రవాసుల భద్రతను నిర్ధారించాలని కోరారు. అలాగే స్థానిక పార్లమెంటు సభ్యురాలు సురీనా బ్రాకెన్‌రిడ్జ్ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. వోల్వర్‌హాంప్టన్‌లోని వైవిధ్యభరితమైన సమాజంలో ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వారెవరైనా ముందుకు వచ్చి పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.
మతపరమైన చిహ్నాలను లక్ష్యంగా చేసుకుని జరిపే ఇలాంటి దాడులు, సమాజంలో పెరుగుతున్న అసహనం, విద్వేషానికి అద్దం పడుతున్నాయి. ఈ దుర్ఘటన బ్రిటన్‌లో మైనారిటీల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసులు ఈ కేసును చిత్తశుద్ధితో దర్యాప్తు చేసి, బాధితులకు న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిక్కు సమాజం డిమాండ్ చేస్తోంది.
More Stories
పాక్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్డౌన్’