2040 నాటికి చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం

2040 నాటికి చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం

* శుభాన్షు శుక్లాకు అభినందించిన మోదీ

2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేవేస్తాడని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ దిశగా దేశంగా వేగంగా అడుగులు వేస్తోందని చెబుతూ అంతరిక్ష రంగంలో ఇది మరో మైలురాయిగా నిలువనుందని తెలిపారు.

లోక్‌సభలో వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర సందర్భంగా `అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత తొలి వ్యోమగామి – 2047 నాటికి విక్షిత్ భారత్ కోసం అంతరిక్ష కార్యక్రమం కీలక పాత్ర’ అనే అంశంపై చర్చను ప్రారంభిస్తూ భారతదేశ అంతరిక్ష యాత్ర ప్రణాళికలో భాగంగా తొలుత 2026లో మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు.  ‘వ్యోమ్మిత్ర’ అనే రోబోటిక్ మిషన్‌ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక 2027లో గగన్‌యాన్‌ మిషన్‌ ద్వారా భారత తొలి మానవ అంతరిక్షయాత్ర నిర్వహించనున్నట్లు జితేంద్ర సింగ్‌ తెలిపారు.

పూర్తిగా భారత్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ మిషన్‌ అవుతుందని పేర్కొంటూ భవిష్యత్తులోభారత్‌ కు  సొంత అంతరిక్ష కేంద్రం అవసరం ఉంటుందని కేంద్రం గుర్తించిందని తెలిపారు.  2035 నాటికి ‘భారత్‌ స్పేస్‌ స్టేషన్‌’ నిర్మాణం పూర్తి చేరయనున్నట్లు జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.  ఇది పరిశోధనలు, అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువుగా మారనుందని తెలిపారు. 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపి సగర్వంగా భారత జెండాను ఎగురవేస్తారని చెప్పారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అంతరిక్ష రంగంలో పలు సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు.

కాగా, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు వెళ్లి చరిత్ర సృష్టించిన గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తన అంతరిక్షయానం గురించి ప్రధానికి వివరించారు. మోదీ శుక్లాను ఆలింగనం చేసుకొని అభినందించారు. ఆయన సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అనంతరం శుక్లా తన అంతరిక్ష ప్రయాణం, అనుభవాలను మోదీకి చెప్పారు.