మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025గా మణిక విశ్వకర్మ

మిస్‌ యూనివర్స్‌ ఇండియా-2025గా మణిక విశ్వకర్మ

రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా ఎంపికయ్యారు. జైపూర్‌లో నిర్వహించిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. గత ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న రియా సింఘా మణికకు కిరీటం అలంకరించింది.  ఈ ఏడాది నవంబర్‌లో థాయ్‌లాండ్ వేదికగా జరిగే 74వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్ తరఫున మణిక విశ్వకర్మ ప్రాతినిధ్యం వహించనున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన తాన్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, మెహక్ ధింగ్రా సెకండ్ రన్నరప్‌గా, హర్యానాకు చెందిన అమిషి కౌశిక్ మూడో రన్నరప్‌గా నిలిచారు.  శ్రీగంగానగర్‌కి చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమెకు క్లాసికల్ డాన్స్, చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉంది. 

మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్‌ను గత ఏడాది గెలుచుకున్నారు. సేవా రంగంలోనూ మణిక విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. ‘న్యూరోనోవా’ సంస్థను స్థాపించి ఏడీ హెచ్ డి  వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు.  అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిమ్స్‌టెక్ సెవోకాన్‌లో భారత్ తరఫున ప్రతినిధిగా పాల్గొన్నారు. 

ఇదిలా ఉండగా, భారత్‌ ఇప్పటి వరకు మూడు సార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధూ ఈ ఘనత సాధించారు.  గత ఏడాది భారత్ తరఫున పోటీలో పాల్గొన్న రియా సింఘా, టాప్ 12లో చోటు దక్కించుకోలేకపోయారు. డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కేజర్ విజేతగా నిలిచింది. డెన్మార్క్ నుంచి ఈ ఘనత సాధించిన మొదటి యువతిగా రికార్డు నెలకొల్పారు. ఈ సారి మణిక విశ్వకర్మ భారత్‌కి మరోసారి కిరీటం తీసుకొస్తుందని భావిస్తున్నారు.