ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడనం

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్‌పుర్‌ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.  దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.  వాయుగుండం తీరం దాటే సమయంలో సముద్రం అలజడి దృష్ట్యా గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

కృష్ణపట్నం, వాడరేవు, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖపట్నం, కళింగపట్నం పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ నెల 24 ఆదివారం వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి 6 లక్షల క్యూసెక్కులపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది.

శ్రీశైలం నుంచి ఐదున్నర లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.  గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద సోమవారం సాయంత్రానికి అడుగు మేర నీటిమట్టం పెరగడంతో ఆలయం పూర్తిగా నీట మునిగింది. పోశమ్మగండి నుంచి డి.రావిలంక వరకు రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది.

వర్షాలకు తోడు మధ్యలో కుంట వద్ద శబరి వచ్చి కలవడంతో గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద పెరిగే అవకాశం ఉందని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం రాత్రికి నీటిమట్టం 31.15 మీటర్లకు చేరింది. 48 గేట్ల ద్వారా 6.89 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.