
జైశంకర్ మాట్లాడుతూ, విభేదాలు వివాదాలు కాకూడదని, పోటీ సంఘర్షణకు దారితీయకూడదని విదేశాంగ మంత్రి డా. ఎస్ జైశంకర్ తెలిపారు. భారత్- చైనా సంబంధాలు పునరుద్ధరించాలంటే నిజాయితీ అవసరమని స్పష్టం చేశారు. సంభాషణ, పరస్పర గౌరవం, ప్రయోజనాలపై బంధం ఉండాలని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చారు. ఆయనతో సోమవారం జైశంకర్ సమావేశమై విస్తృతంగా చర్చించారు. స్పష్టమైన శాంతియుత మార్గమే అవసరమని తెలిపారు.
సరిహద్దుల్లో శాంతి ఉంటేనే సంబంధాలు మెరుగవుతాయని జైశంకర్ తెలిపారు. బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా సాగాలని, చర్చలు పటిష్టంగా జరగాలని సూచించారు. వాంగ్ యీ మాట్లాడుతూ, శాంతియుత పరిస్థితులు కొనసాగుతున్నాయని చెబుతూ మానస సరోవర్ యాత్రలకు అనుమతి ఇచ్చాం అని, చర్చలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. వాంగ్ యీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీతో సమావేశం కానున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా సమావేశమవుతారు.
2020లో గల్వాన్ లోయ ఘటన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. తూర్పు లడఖ్‌లో నాలుగేళ్లుగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వెంబడి పరిస్థితులపై చర్చలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శాంతిని లక్ష్యంగా పెట్టుకుని చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ చర్చలు కీలకం కానున్నాయి. ఉద్రిక్తత తగ్గించేందుకు ఇది సానుకూల అడుగు అయ్యింది.
ఉగ్రవాదాన్ని అన్ని రకాలుగా ఎదుర్కోవడమే ప్రధానమని చెబుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడం, పెంచడం అత్యవసరమని జైశంకర్ పేర్కొన్నారు. ఇరువురు నేతలు భారత్, చైనా మధ్య ఉన్న ఆర్థిక, వాణిజ్య సమస్యలు, తీర్థయాత్రలు, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, నదుల డేటా పంచుకోవడం (రివర్ డేటా షేరింగ్), సరిహద్దు వాణిజ్యం, కనెక్టివిటీ, బిలేటిరల్ ఎక్స్ఛేంజ్ల గురించి చర్చించారు. భారతదేశం న్యాయమైన, సమతుల్య, బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు.
“ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలు సమావేశం అయినప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల గురించి చర్చించడం సహజం. బహుళ ధ్రువ ఆసియాతో సహా న్యాయమైన, సమతుల్య, బహుళ ధ్రువ ప్రపంచాన్ని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడం, పెంచడం చాలా అవసరం. అలాగే అన్ని రూపాల్లో, వ్యక్తీకరణల్లో ఉగ్రవాదంపై పోరాడడం ప్రధానం” అని జైశంకర్ తెలిపారు.
“ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై, పరస్పర ఆసక్తి ఉన్న కొన్ని అంశాలపై ఇరుదేశాలు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. మన సంబంధాల్లో క్లిష్ట సమయాన్ని చూశాం. ఇప్పుడు రెండు దేశాలు ముందుకు సాగాలని చూస్తున్నాయి. దీనికి రెండు వైపుల నుంచి నిష్కపటమైన, నిర్మాణాత్మక విధానం అవసరం” అని జైశంకర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా భారత్, చైనా కలిసి ప్రపంచానికి స్థిరత్వాన్ని అందించగలవని వాంగ్ యీ తెలిపారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు