
2020 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. సైబర్ భద్రతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)కు చెందిన సైబర్ సెక్యూరిటీ & ఐటీ రిస్క్ గ్రూప్ (సీఎస్ఐటిఈ) నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని, సైబర్ భద్రతా చట్రాన్ని బలోపేతం చేయడానికి వివిధ సర్క్యులర్లు/మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేస్తోందని మంత్రి తెలిపారు.
ఎంప్యానెల్ చేయబడిన 200 సంస్థల ద్వారా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టి-ఇన్) భారతీయ బ్యాంకింగ్ రంగంలోని వివిధ సంస్థల కంప్యూటర్ సిస్టమ్లు, నెట్వర్క్లు, వెబ్సైట్లు, క్లౌడ్ అప్లికేషన్లను నిరంతరం ఆడిటింగ్ చేస్తోందని, ఈ సంస్థలు గత ఐదేళ్లలో 29,751 ఆడిట్లను నిర్వహించాయని, ఏమైనా లోపాలు గమనిస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు తెలియచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన బ్యాంకు సైబర్ మోసాలను పరిశీలిస్తే 2020 లో 36, 2021 లో 59, 2022లో 98, 2023లో 66, 2024లో 82 సైబర్ నేరాలు నమోదవ్వగా, ఈ ఐదేళ్లలో ఖాతాదారులు నష్టపోయిన మొత్తం విలువ 132.97 కోట్లు అని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరించారు.
More Stories
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ
షర్మిల జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?