
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టనంలో జిహాదీ లింకులు కేసులో నిందితుడు నూర్ మహమ్మద్‌కు కోర్టు 14 రోజుల న్యాయస్థాన రిమాండ్ విధించింది. అతడిపై దేశద్రోహం సహా యూఏపీఏ చట్టం (1967) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు నూర్ మహమ్మద్‌ను కదిరి కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 29 వరకు రిమాండ్‌లో ఉంచాలని జడ్జి ఆదేశించారు. అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నూర్ మహమ్మద్ సుమారు 37 వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు.
వాటిలో ఆల్ ఖైదా, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ప్రొపగాండా వీడియోలు, జిహాదీ భావజాలాన్ని పంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తూ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో, భార్యతో విభేదాల కారణంగా వేరుగా ఉంటూ, తాడిపత్రికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నట్లు బయటపడింది.
పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలతో ఆ మహిళకు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో ప్రశ్నించారు. రోజు కూలీగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ ధర్మవరం పట్టణం లోనకోటలో ఇటీవలే కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. రోజు కూలీకి అంత మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే పోలీసుల ఆరా తీస్తున్నారు. సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తికి రానున్నారు.
ఈ పర్యటన అంశం కూడా అతడు సభ్యుడిగా ఉన్న పాక్ ఉగ్రవాద వాట్సాప్ గ్రూపుల్లో చర్చకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నూర్ మహమ్మద్ తల్లిదండ్రులు తమ కొడుకు మంచివాడని, పోలీసులు అతన్ని ఎందుకు తీసుకెళ్లారో తెలియదని చెబుతున్నారు. తమ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పోలీసులకు ఏమీ దొరకలేదని వివరించారు.
తదుపరి దర్యాప్తు కోసం నూర్ మహ్మద్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది. ఇక, ఇదే కేసులో ఎర్రగుంటకు చెందిన రియాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను వాట్సప్ స్టేటస్‌లో పాక్ జెండా, పాక్ జిందాబాద్ నినాదాలు, సయ్యద్ బిలాల్ వీడియోలు పెట్టడంతో మరింత అనుమానం వ్యక్తమైంది. జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వీ. రత్న స్పష్టం చేశారు.
రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సమాచారంతో ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూర్ మహమ్మద్ ఇంటిని తనిఖీ చేసి, మొబైల్ ఫోన్‌తో పాటు జిహాదీ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక రాగానే, అతని ఉగ్రవాద సంబంధాలపై పూర్తి వివరాలు బయటపడనున్నట్లు ఎస్పీ తెలిపారు.
యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. నూర్ మహమ్మద్ ధర్మవరంలోని ఓ బిర్యానీ సెంటర్‌లో కుక్‌గా పనిచేస్తుండగా.. అతడి తల్లి, చెల్లెలు ఇంట్లో బీడీలు చుడుతుంటారు. పకడ్బందీగా ప్రణాళిక రూపొందించుకుని పగలు బిర్యానీ సెంటర్‌లో పనిచేస్తూ రాత్రిపూట ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తేలింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురితోనూ అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ, ఐబీ అధికారులు గుర్తించారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్