మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం

మావోయిస్టు అరెస్టు.. ఆయుధాలు స్వాధీనం
 
* ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేల్చడంతో ఓ జవాన్ మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ చింతగుప్ప గ్రామ సమీపంలో ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా బలియాపుట్టు గ్రామానికి చెందిన మావోయిస్టు చైతో అలియాస్‌ నరేశ్‌ను శనివారం సాయంత్రం పట్టుకుని అరెస్టు చేసినట్టు ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు. చింతగుప్ప పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారని, కాల్పులు జరుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని ఎస్పీ తెలిపారు. 
 
ఈ సందర్భంగా చైతోను పట్టుకున్నట్టు చెప్పారు. అతడి నుంచి 90 ఎంఎం పిస్టల్‌, 904 ఎంఎం అమ్ములపొది, 303 రైఫిల్‌ మ్యాగ్‌జైన్‌, 303 లైవ్‌ అమ్ములపొది, 3 కిట్‌ బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. 2011లో జననాట్య మండలి బృందంలో చేరిన చైతో 15 ఏళ్ల వయసులోనే మావోయిస్టు దళంలో చేరాడని చెప్పారు. 2017లో కటాఫ్‌ ఏరియా బొయిపరగుడ దళ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టాడని తెలిపారు. 
 
ప్రస్తుతం డీసీఎం సభ్యుడిగా, పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ సెక్రటరీగా మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తున్నాడని, ఇప్పటికే 8 ఎన్‌కౌంటర్లలో చైతో పాల్గొన్నాడని వివరించారు. మావోయిస్టులు లొంగిపోతే వారికి పునరావాసం కల్పిస్తామని ఎస్పీ అమిత్‌ బర్దార్‌ తెలిపారు.
మరోవంక, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని భోపాల్‌పట్నం పరిధి ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోమవారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ జవాన్లు ఇంద్రావతి నేషనల్‌ పార్క్‌లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. 
 
ఈ క్రమంలో ఉల్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన మందుపాతరని మావోయిస్టులు పేల్చారు. దీంతో డీఆర్‌జీ జవాన్‌ దినేశ్‌ నాగ్‌ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని దవాఖానకు తరలించారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వెల్లడించారు.