శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం… ఐదుగురు మృతి

శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం… ఐదుగురు మృతి
హైదరాబాద్‌ రామంతాపూర్‌లో అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. 
 
ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం బ్రేక్‌ డౌన్‌ అయింది. దానిని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. దానికి కరెంటు తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి షాక్‌ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సీపీఆర్‌ చేసేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.

మరో నలుగురిని స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిని కృష్ణయాదవ్‌ (21), సురేశ్‌ యాదవ్‌(34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ ‌(39), రాజేంద్రరెడ్డి (45)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్‌ శ్రీనివాస్‌ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.

పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. అనంతరం సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానికులను అడిగి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరుఫున పరిహారం అందించేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులు వెల్లడించారు.