ఉగ్రవాదులతో పోరుకు సైనికులకు సరికొత్త వాహనం!

ఉగ్రవాదులతో పోరుకు సైనికులకు సరికొత్త వాహనం!
ముంబాయి 26/11/2008 ఉగ్రవాద ఘటనలో సైన్యం వెంటనే వారి దగ్గరకు చేరుకోలేక పోవడంతో 175 మంది అమాయక పౌరులు నిర్థాక్షిణ్యంగా హత్యకు గురయ్యారు. అందుకనే, జనావాసాల్లో, ఇళ్ళ మధ్యలో, భవనాల లోపల దాక్కుని దాడులు చేసే ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి  డిఆర్‌డీఓ కొత్తరకం వాహనం `ఉగ్రవాద వ్యతిరేక వాహనం’ (యాంటీ టెర్రరిస్ట్ వెహికల్ – ఏటివి)ను  తయారుచేసింది.

దీని బరువు సుమారు 3 టన్నులు, దీన్ని ఒకరు నడుపుతూ ఇద్దరు ఆయుధాలు ఉపయోగిస్తూ మొత్తం ముగ్గురు సైనికులు ఉపయోగించవచ్చు. ఇది పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్, హ్యాండ్ గ్రనేడ్ ప్రూఫ్, బ్లాస్ట్ ప్రూఫ్. ఎటువంటి  శబ్దం చేయని విధంగా రూపొందించిన విద్యుత్ వాహనం.  ఇది 7 అంగుళాల ఎత్తున్న మెట్లు కూడా ఎక్కగలదు.

ఇరుకైన సందుల్లో, ఇళ్ళ మధ్య, బిల్డింగుల కారిడార్లలో ఇది సులువుగా చొచ్చుకుపోతుంది. కావాలంటే పైనుంచి టాప్ లేపుకుని సైనికులు బయటికి దూకేయొచ్చు. దీన్ని బెల్ట్‌ట్రాక్, టైర్ రెండు వర్షన్లలోనూ డిఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఉన్న చోటినే అక్కడే ఉండి 360 డిగ్రీలు చుట్టూ రౌండు తిరగగలదు. ఉగ్రవాదులు, పేలుడు పదార్థాలు ఏ వైపున, ఎంత దూరంలో ఉన్నాయో కనిపెట్టే సెన్సార్లు దీనిలో ఉన్నాయి.