సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు

సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు
 

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డికి మరోసారి చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు, గతంలో విస్తృత చర్చకు కారణమైన ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించినవే. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనేక రకాలుగా లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై వచ్చాయి. ఇందులో సబితా ఇంద్రారెడ్డి పేరు కూడా ఉంది. ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు కొంతకాలం క్రితం సబితా ఇంద్రారెడ్డి సహా పలువురిని నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది.  ఆ తీర్పు వెలువడిన తర్వాత సబితా రాజకీయంగా ఊపందుకున్నారు. అయితే, సీబీఐ మాత్రం ఈ తీర్పుతో సంతృప్తి చెందలేదు.
 నాంపల్లి సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, తాజా పరిణామంగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందంలకు నోటీసులు జారీ చేసింది.  అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.వీరిద్దరూ కోర్టుకు సమాధానం ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ విడి రాజగోపాల్ లను దోషులుగా నిర్ధారిస్తూ శిక్షలు ఖరారు చేసింది.
 
గాలి జనార్ధన్ రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దోషులకు రూ. 10 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో, అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రా రెడ్డికి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వారిని నిర్దోషులుగా ప్రకటించడంతో సీబీఐ హైకోర్టుకు వెళ్లింది.