
వాయవ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో 18న (సోమవారం) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే విధంగా ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో ఇంకో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో కోస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కళింగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడ్డాయి. అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో 42.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చినుకు జాడ లేదు. కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఐఎండీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 298.8 మిల్లీమీటర్లు కాగా 4 శాతం ఎక్కువగా (311.6MM) కురిసింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ వెబ్‌సైట్ ప్రకారం రాష్ట్రంలో సగటున 348 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 317.1 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే లోటు వర్షపాతం నమోదైంది.
కాగా, సెప్టెంబరులో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ డా.కేజే రమేశ్ తెలిపారు. రాబోయే రోజుల్లో అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉండే పరిస్థితులున్నాయని చెప్పారు. రుతుపవనాల సీజన్‌లో కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం సాధారణమే అని, వచ్చే వారంలో కురిసే వర్షాలతో ఉత్తర కోస్తా తదితర జిల్లాలు లోటు వర్షపాతం నుంచి సాధారణ స్థితికి వచ్చే అవకాశమున్నట్లు రమేష్ వెల్లడించారు. తమిళనాడు, దక్షిణకోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడితేనే నెల్లూరులో వర్షాలు కురుస్తాయని వివరించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు