
హరియాణాలో ప్రతి ఉద్యోగ నియామకం అవినీతి ప్రభావానికి లోనైందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో హరియాణాలో డబ్బు ఖర్చు చేయకుండా నియామకం పొందడం కష్టంగా ఉండేది. కానీ హరియాణానలో నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో లక్షలాది మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
రూ. 11వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్‌తో, దేశ రాజధాని దిల్లీని అనుసంధానం చేయటం వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుందని ప్రధాని చెప్పారు. గత 11ఏళ్లలో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. ఎన్డీఏ పాలనలో సంస్కరణలు నిరంతరం కొనసాగుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీఎస్‌టీ చట్టాన్ని సరళతరం చేయటంతోపాటు పన్నుల శ్లాబ్‌లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
“డిల్లీకి ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే-అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్‌తో కనెక్టివిటీ లభించింది. దీనివల్ల దిల్లీ, గురుగ్రామ్ మొత్తం ఎన్‌సీఆర్ ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. దీంతో సమయం ఆదా అవుతుంది” అని చెప్పారు.
“పంద్రాగస్టున ఎర్రకోట నుంచి నేను దేశ ఆర్థిక వ్యవస్థ, ఆత్మనిర్బరత, దేశం ఆత్మవిశ్వాసంపై నమ్మకంతో మాట్లాడాను. నేటి భారత్ ఏం ఆలోచిస్తుంది, దాని కలలు ఏమిటి, సంకల్పం ఏమిటి అనే విషయాలను నేడు ప్రపంచమంతా చూస్తోంది. ప్రపంచం భారత్‌ను చూసినప్పుడు మొదటి దృష్టి దేశ రాజధానిపై పడుతుంది. అందుకే డిల్లీని అభివృద్ధికి మోడల్‌గా చేయాలి. అభివృద్ధి చెందుతున్న భారత రాజధాని అని అనిపించాలి” అని ప్రధాని తెలిపారు.
రేఖా గుప్తా నాయకత్వంలో ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధి గురించి మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం యమునా నది శుభ్రపరిచే పనిలో నిరంతరం నిమగ్నమై ఉండటం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కాలంలో యమునా నది నుంచి 16 లక్షల మెట్రిక్ టన్నుల బురదను తొలగించినట్లు తనకకు సమాచారం అందిందని తెలిపారు.
అంతేకాకుండా, ఢిల్లీలో చాలా తక్కువ సమయంలోనే 650 దేవి ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో, ఈ ఎలక్ట్రిక్ బస్సులు దాదాపు 2,000 సంఖ్యను అధిగమిస్తాయని వివరించారు. ఇది గ్రీన్ దిల్లీ – క్లీన్ దిల్లీ మంత్రాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
“చాలా సంవత్సరాల తర్వాత, దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. గత ప్రభుత్వాలు డిల్లీని ఎలా నాశనం చేసి, ఇంత లోతైన గొయ్యిలోకి నెట్టాయో మనం చూడవచ్చు. మొదట ఆ గొయ్యిని నింపడానికి చాలా కృషి చేస్తాం. ఆ తర్వాతే పురోగతి కనిపిస్తుంది. ఢిల్లీలో మీరు ఎంచుకున్న ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందని, నగరం సమస్యల నుంచి త్వరలో బయటపడుతుందని నాకు నమ్మకం ఉంది” అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
More Stories
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్
శతాబ్ది సందర్భంగా `పంచ పరివర్తన్’పై ఆర్ఎస్ఎస్ దృష్టి
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు