
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుక్లా బృందం ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌కు శుక్లా చీఫ్ పైలట్‌గా వ్యవహరించారు. ఐఎస్‌ఎస్‌లో 18 రోజుల పాటూ గడిపిన ఆయన 60కిపైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. శుభాన్షు బృందం జులై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది.
ఇక అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా రికార్డు సృష్టించారు. 1984లో సోవియట్ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్ మిషన్ కింద సూయజ్ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టించారు. ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడు కూడా ఇతనే కావడం విశేషం.
శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకోవడం భారత్‌కు గర్వకారణమైన క్షణంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. “భారతదేశానికి గర్వకారణమైన క్షణం! ఇస్రోకు కీర్తినిచ్చే క్షణం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దీనికి దోహదపడిన వ్యవస్థకు కృతజ్ఞత తెలుపుతూ, దేశ అంతరిక్ష వైభవం భారత గడ్డను తాకింది” అని ఎక్స్ లో తెలిపారు. “భారతమాత దిగ్గజ పుత్రుడు శుభాంశు శుక్లా ఈరోజు తెల్లవారుజామున దిల్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు మిషన్ గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో ఒకరైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు” అని పేర్కొన్నారు.
కాగా, యాక్సియం-4 మిషన్ విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు వస్తున్నానంటూ శుక్లా శనివారం పోస్టు ద్వారా తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమానంలో కూర్చున్నప్పుడు భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. మిషన్ కోసం గతేడాది నుంచి తన స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇది తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలిపారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం