ఎఐ మానవాళిని పూర్తిగా తుడిచి పెట్టేస్తుంది

ఎఐ మానవాళిని పూర్తిగా తుడిచి పెట్టేస్తుంది

అత్యాధునిక ఎఐ వ్యవస్థలను సరైన రీతిలో వినియోగించకపోతే మానవాళికి పెద్ద ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఎఐ’గా పేరుగాంచిన జాఫ్రీ హింటన్‌ లాస్‌ వెగాస్‌లో నిర్వహించిన ఎఐ 4 కాన్ఫరెన్స్‌లో  మాట్లాడుతూ  భవిష్యత్తులో ఎఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరించారు. 

ఈ ప్రమాదాన్ని నివారించాలంటే భావోద్వేగ స్పందనలు కలిగిన ఎఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని సూచించారు. మానవుల పట్ల సంరక్షణ భావాన్ని కలిగించగల సామర్థ్యం వాటిలో ఉండాలని స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఎఐ పూర్తిగా మానవ నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఈ పరిస్థితి ఎప్పటికీ అలాగే కొనసాగుతుందని చెప్పలేమని హింటన్‌ స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో ఎఐ మానవ మేధస్సును మించిపోయిన తర్వాత మనం పెట్టిన పరిమితులను దాటేందుకు మార్గాలను వెతుకుతుందని ఆయన హెచ్చరించారు. ఉదాహరణకు, ఇటీవల ఒక ఎఐ వ్యవస్థ, ఓ ఇంజినీర్‌ వ్యక్తిగత రహస్యాలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించిన సంగతిని గుర్తుచేశారు. 

ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, అందుకే మానవీయ భావోద్వేగాలను కలిగిన ప్రత్యేక ఎఐ మోడల్స్‌ అవసరమని, దీని ద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందని హింటన్‌ సూచించారు.  ఎఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య రంగంలో ఎఐ ను వాడి ప్రయోజనాలు పొందవచ్చని గాడ్‌ఫాదర్‌ ఆఫ్‌ ఎఐ హింటన్‌ తెలిపారు. 

ఔషధ అభివృద్ధి, క్యాన్సర్‌ చికిత్సలో ముందడుగు, రోగాల ముందస్తు నిర్ధారణ, సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలో ఎఐ విప్లవాత్మక మార్పులు తెస్తుందని చెప్పారు. అదే సమయంలో, ప్రస్తుత ఎఐను మించి మరింత అభివృద్ధి చెందిన కృత్రిమ సాధారణ మేధస్సు మరో ఐదు నుంచి ఇరవై ఏళ్లలో వస్తుందని అంచనా వేశారు. ఇది మానవాళి భవిష్యత్తును నిర్ణయించే కీలక సాంకేతిక మైలురాయిగా మారవచ్చని హింటన్‌ అభిప్రాయపడ్డారు.