నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గణేశన్ శుక్రవారం తనువు చాలించారని రాజ్‌భవన్ అధికారి తెలిపారు. నాగాలాండ్ గవర్నర్ గణేశన్ మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
గణేశన్ నిజమైన జాతీయవాది అని, ప్రజాసేవ, జాతి నిర్మాణానికి తమ జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, తమిళ సంస్కృతిని ఆయన ఎంతగానో ఇష్టపడేవారని కొనియాడారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆయన మరణ వార్త తమను ఎంతో విషాదంలోకి నెట్టిందని ఉపముఖ్యమంత్రి యన్‌తుంగో పట్టొన్ తెలిపారు. పలువురు రాజకీయ ప్రముకులు గవర్నర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
ఆగస్టు 8 వ తేదీన గణేశన్ చెన్నైలోని తన నివాసంలో కిందపడిపోయారు. ఆ సమయంలో ఆయన తలకు బలమైన గాయం అయింది. వెంటనే కుటుంబసభ్యలు గవర్నర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఐసీయూలో చేర్చుకున్నారు. వారం రోజులుగా ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో గణేశన్ కన్నుమూశారు. ఆయన రెండేళ్ల క్రితం అంటే, ఫిబ్రవరి 12న నాగాలాండ్ 21వ గవర్నర్‌గా నియమితులయ్యారు.
“నిబద్ధత కలిగిన దేశభక్తుడు, వాక్ఫటిమ కలిగిన వక్త, దేశ సేవకే జీవితాన్ని ధారపోసిన నాయకుడు గణేశన్. ఆయన తన నిరాడంబరత, మానవతా విలువలు, ప్రజా శ్రేయస్సు పట్ల అమితమైన అంకితభావంతో ఆదర్శంగా నిలిచారు. కొన్నేళ్లుగా నిస్వార్ధంగా గణేశన్ చేసిన సేవలు చిరస్మరణీయం” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దివంగత గవర్నర్‌ను ఉద్దేశించిన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
“మణిపూర్ మాజీ గవర్నర్, ప్రస్తుతం నాగాలాండ్ ప్రథమ పౌరుడిగా ఉన్న గణేశన్ కన్నుమూయడంతో చాలా బాధగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం నిజాయతీగా పాటుపడిన ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. ఆ కష్ట సమయలో ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
గణేషన్ భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో అనుభవజ్ఞుడు. ఆయన ఫిబ్రవరి 20, 2023 నుండి మరణించే వరకు నాగాలాండ్ 19వ గవర్నర్‌గా పనిచేశారు. ఆయన అంతకు ముందు, ఆగస్టు 27, 2021 నుండి ఫిబ్రవరి 19, 2023 మధ్య మణిపూర్ 17వ గవర్నర్‌గా, జూలై 18, 2022 నుండి నవంబర్ 17, 2022 మధ్య పశ్చిమ బెంగాల్ గవర్నర్ (అదనపు ఛార్జ్)గా ఉన్నారు.
అంతకు ముందు, ఆయన మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. లా గణేషన్ గతంలో మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. గణేషన్ ఫిబ్రవరి 16, 1945న తమిళనాడులోని ఇలక్కుమిరకవన్, అలమేలు దంపతులకు తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు, ఆ తర్వాత తన సోదరుడితో కలిసి జీవిస్తూ విద్యను కొనసాగించాడు. తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరి, ఆ సంస్థకు పూర్తికాల ప్రచారక్ గా ప్రజా జీవితానికి పూర్తిగా అంకితమయ్యారు.
తర్వాత సాంప్రదాయకంగా ద్రవిడ పార్టీల ఆధిపత్యం గల తమిళనాడులో బిజెపి సంస్థాగతంగా నిలదొక్కుకునేందుకు విశేషంగా కృషి చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. చివరికి ఆయన బిజెపి తమిళనాడు రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. .
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం