ధర్మస్థలలో సుజాత భట్‌ కు కుమార్తె అదృశ్యం మిస్టరీ!

ధర్మస్థలలో సుజాత భట్‌ కు కుమార్తె అదృశ్యం మిస్టరీ!
* ఆమెకు పిల్లలే లేరని తాజా కధనాలు!
 
కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో గత రెండు దశాబ్దాల్లో అనేక మంది మహిళలు అక్కడ హత్యకు గురయ్యారని, వారిలో దాదాపు 80 మంది మహిళలను తానే పాతిపెట్టానని ఓ రిటైర్డ్‌ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటి వరకు సిట్ తవ్వకాలలో అందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
కనీసం మహిళలు కనిపించడం లేదని నిర్దుష్టమైన ఫిర్యాదులు కూడా లేవు. కేవలం తన కూతురు అనన్య భట్ కూడా ధర్మస్థలకు వెళ్లి అదృశ్యమైందని సుజాత భట్‌ (80) అనే మహిళ ఫిర్యాదు మాత్రమే రెండు దశాబ్దాలుగా కలకలం రేపుతోంది.  అయితే,  సుజాత భట్‌ పూర్వాపరాలను విచారిస్తే ఆమెకు అసలు కూతురే లేదని, పిల్లలే లేరని వెల్లడవుతుంది.
మణిపాల్‌ హాస్పిటల్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతురు అనన్య భట్‌ 2003లో తన స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిందని, అప్పట్నుంచి కనిపించడం లేదని ఇటీవల సుజాత భట్‌ ఫిర్యాదు చేశారు. పైగా, తాను కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేసేదాన్ని, వీఆర్‌ఎస్‌ తీసుకుని 2004లో బెంగళూరు వచ్చి స్థిరపడ్డానని తెలిపారు. 
 
అయితే ‘ తెలంగాణ టుడే ‘ సేకరించిన వివరాలు, ప్రత్యక్ష సాక్షుల విచారణ, అధికారుల నుంచి సమాచారం తీసుకున్నప్పుడు సుజాత భట్‌ చేసిన వ్యాఖ్యల్లో పలు అసమానతలు కనిపించాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సుజాత భట్‌ కోల్‌కతాలో నివసించలేదు. 1999 నుంచి 2007 వరకు శివమొగ్గ జిల్లా రిప్పన్‌పేటలో ఉండేది. అప్పటికి ఆమెకు పెళ్లి కాలేదు కానీ ఉడిపికి చెందిన మాజీ బస్‌ ఏజెంట్‌ ప్రభాకర్‌ బలిగ అలియాస్‌ నై ప్రభాకర్‌తో ఆమె సహజీవనం చేసింది. 
 
వారిద్దరికీ సంతానం లేకపోవడంతో వీధి కుక్కలను దత్తత తీసుకుని వాటిని తమ కన్నపిల్లలుగా చూసుకునేవారు. దీనికి సంబంధించి 2002, 2003లో కమలవాణి, సుధ వంటి వార్త పత్రికల్లో పలు కథనాలు కూడా ప్రచురించారు. ప్రభాకర్‌ బలిగ స్నేహితుడు టీఆర్‌ కృష్ణప్ప కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. తెలంగాణ టుడేతో ఆయన మాట్లాడుతూ ‘ సుజాతను మేం ఇక్కడ ప్రతిరోజూ చూసేవాళ్లం. ఆమెకు పిల్లలు లేరు. అసలు అనన్య అనే అమ్మాయే లేదు’ అని తెలిపారు.
 
ప్రభాకర్‌ బలిగ తాగుబోతు. అతను 2007లో సుజాతను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో రిప్పన్‌పేట నుంచి సుజాత బెంగళూరుకు మారింది. బెంగళూరులో ఓ న్యాయమూర్తి ఇంట్లో పని దొరికిందని పక్కింటి వాళ్లకు చెప్పి వెళ్లింది. ఆ తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కాగా సుజాతతో విడిపోయిన రెండేళ్లకు అంటే, 2009లో ప్రభాకర్‌ బలిగ మరణించాడు.సుజాత 1995 నుంచి 2004 వరకు కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశానని చెబుతున్నారు. కానీ కోల్‌కతా సీబీఐ అధికార ప్రతినిధిని సంప్రదించగా 1999 నుంచి 2010 వరకు ఆ పేరుతో ఎవరూ ఉద్యోగం చేయలేదని స్పష్టం చేశారు. సుజాత బావ మహాబలేశ్వర మాట్లాడుతూ ఆమె పదో తరగతి వరకు మాత్రమే చదువుకుందని తెలిపాడు. 2000 వరకు బెంగళూరులోకి కిరాణ షాపులో పనిచేసి, తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు.

అనన్య కనిపించడం లేదని ఆమె స్నేహితురాలు రష్మి ఫోన్‌ చేసిన వెంటనే తాను ధర్మస్థల, బెల్తంగడి పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేశానని సుజాత భట్‌ తెలిపారు. కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించకపోవడతో ధర్మస్థల ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే, ఆయన సోదరుడు, ఆలయ ప్రధాన నిర్వాహకుడు హర్షేంద్ర కుమార్‌లను కలిశానని చెప్పారు. అప్పుడు వారు తనతో దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.

అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో ధర్మస్థల ఆలయ సిబ్బంది నలుగురు వచ్చి తనను ఒక గదిలోకి బలవంతంగా తీసుకెళ్లారని, అక్కడ కుర్చీకి కట్టేసి చాలా కొట్టారని సుజాత తెలిపారు. ఆ సమయంలో స్పృహ కోల్పోయిన తాను లేచేసరికి బెంగళూరు ఆస్పత్రిలో ఉన్నానని పేర్కొన్నారు. 

ధర్మస్థల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మంగళూరు ఉందని, అక్కడ కూడా మంచి ఆస్పత్రులు ఉండగా, 300 కి.మీ.ల దూరం తీసుకొచ్చి బెంగళూరు ఆస్పత్రికి వెరు తీసుకొచ్చారని ప్రశ్నించగా‘అప్పుడు నేను అపస్మారక స్థితిలో ఉన్నా, మూడు నెలల పాటు విల్సన్‌ గార్డెన్‌లోని అగాడి ఆస్పత్రిలో కోమాలోనే ఉన్నా’ అని చెప్పారు. కానీ ఆ ఆస్పత్రి నిర్వాహకులను తెలంగాణ టుడే సంప్రదించగా ఆమె పేరుతో ఎటువంటి ఐసీయూ రికార్డులు లేవని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఈ కేసును చూస్తుంటే అసలు అనన్య భట్‌ నిజంగానే ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ధర్మస్థలలో తన కూతురు తప్పిపోయిందని సుజాత చెబుతున్నప్పటికీ కనిపించే ప్రతి సాక్ష్యం కూడా ఆమెకు విరుద్ధంగానే కనిపిస్తున్నాయి.